సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం.. కీలకమైన అంశాలకు ఆమోద ముద్ర వేసింది. జగనన్న చేయూత, జగనన్న తోడు పథకాలకు.. రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాయపట్నం పోర్టు నిర్మాణ డీపీఆర్ సహా, పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

నవరత్నాల పథకాల్లో భాగంగా.. వైఎస్ ఆర్ చేయూత కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆర్ధిక సాయం అందించే పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏడాదికి 18 వేల 750 రూపాయల చొప్పున ఐదేళ్లలో 75 వేల రూపాయల ఆర్ధిక సాయానికి ఆమోద ముద్ర వేసింది. ఇక జగనన్న తోడు కింద చిరువ్యాపారులకు సున్నావడ్డీకే రుణాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం 56 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రభుత్వం భరించనుంది. మరోవైపు మహిళలు, పిల్లలకు ఆదనపు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ల పట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు కేబినెట్‌ అంగీకరించింది. ఐదేళ్ల పాటు నివాసం ఉన్న తర్వాతనే స్థలాలు విక్రయించుకునేందుకు చేసిన మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో గ్రేహౌండ్స్ శిక్షణా స్థలం కోసం 385 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్  నిర్ణయం తీసుకుంది. బిల్డ్ ఏపీలో భాగంగా 16 స్థలాల్లో 11 స్థలాల విక్రయానికి ఆమోదముద్ర పడింది. అలాగే విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు, తెలుగు , సంస్కృత అకాడెమీని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు కేబినెట్  ఆమోదం తెలిపింది. గుంటూరు , శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో 282 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఏర్పాటుకు అమోదాన్ని తెలిపింది.

 

ఇక రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు పనుల్ని కాంట్రాక్టు సంస్థకు అప్పగించేందుకు.. హైకోర్టు ముందు జాయింట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ ను ఫైల్ చేసేందుకు  మంత్రి వర్గం ఆమోదాన్ని తెలిపింది. ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించేందుకు అంగీకారం తెలిపింది. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ కు  కూడా కెబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో 3,736 కోట్ల రూపాయలతో నిర్మాణ ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం  ఆగస్టులో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. గండికోట, వెలిగొండ నిర్వాసితుల కోసం నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదముద్ర పడింది. 

 

ఇంటిగ్రేటెడ్‌ రెన్యువల్‌ ఎనర్జీ ప్రాజెక్టు గ్రీన్ కోకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో భాగంగా 550 మెగావాట్లు విండ్‌ పవర్, 1200 మెగావాట్ల హైడ్రో, 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి సంస్థ అంగీకరించినట్టు ప్రభుత్వం తెలిపింది. బోగాపురం విమానాశ్రయాన్ని 2200 ఎకరాలకు కుదించిన స్థలంలో నిర్మాణానికి జీఎంఆర్ తో తాజా ఒప్పందానికి కేబినెట్ అంగీకాన్ని తెలిపింది.

 

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయ ద్వారాలను తెరిచేందుకు వారసత్వంగా వస్తున్న సన్నిధి గొల్లలకు వారసత్వపు హక్కులను కల్పించేలా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కెబినెట్ తీర్మానించింది. .

 

మరింత సమాచారం తెలుసుకోండి: