జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు అద్భుతమైన పాలన అందించడంతో పాటు, గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలని వెలికితీస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎవరైతే అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారో వారిని జగన్ వరుసగా టార్గెట్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల అక్రమాలు బయటపెట్టి వారిని జైలుకు పంపారు.
ఈఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జైలు పాలయ్యారు. అటు వాహనాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలని కూడా జైలుకు పంపారు. ఇంకా ఈఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఆయన తనయుడు సురేష్‌ల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అటు వైఎస్సార్‌సీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కటకటాల పాలయ్యారు.
ఇక గతంలో సైకిళ్ళ కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మీద అనేక కేసులు పడ్డాయి. ఇంకా మాజీ మంత్రులు దేవినే ఉమా, ప్రత్తిపాటి పుల్లారావులపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్...పరిటాల ఫ్యామిలీ అక్రమాలని బయటకు తీసేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో పరిటాల సునీత పౌరసరఫరాలు, స్త్రీ,శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు.
ఇప్పటికే చంద్రన్న కానుకలో అవినీతి జరిగిందని చెప్పి, ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల నిర్మాణాల విషయంలో కూడా పరిటాల ఫ్యామిలీ అవినీతికి పాల్పడిందని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పరిటాల సునీత సోదరులు, వారి అనుచరులు నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను పొందారని, అడ్డగోలుగా వ్యవహరించి కోట్ల రూపాయలను దోచారని ప్రకాష్ రెడ్డి చెబుతున్నారు. పరిటాల ఫ్యామిలీ అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ పాల్పడిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విధంగా గతంలో జరిగిన అక్రమాలని వెలికితీస్తున్న జగన్ పరిటాల ఫ్యామిలీని కూడా ఫిక్స్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి