మదనపల్లెకు చెందిన రైతు నాగేశ్వరరావు, ఆయన ఇద్దరు కూతుళ్లు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. వ్యవసాయం కోసం ఎద్దులు లేక తన ఇద్దరు కూతుళ్లతో ఆయన పొలం దున్నిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దాన్ని కృష్ణమూర్తి అనే వ్యక్తి సోనూసూద్‌కు ట్వీట్ చేయడం.. సోనూ సూద్ వెంటనే స్పందించి.. ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడం చకచకా జరిగాయి.


ఆ తర్వాత సోనూసూద్ మంచి మననును టీడీపీ అధినేత చంద్రబాబు అభినందిస్తూ.. తాను కూడా నాగేశ్వరరావు కుటుంబానికి సాయం చేస్తానని ముందుకొచ్చారు. ఆయన ఇద్దరు కూతుళ్లను హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మోడల్ కాలేజీలో ఉచితంగా చదివిస్తానని.. ఉచితంగా హాస్టల్ వసతి కల్పస్తానని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. అందుకు సంబంధించిన అడ్మిషన్ పత్రాలను కూడా నాగేశ్వరరావు కుటుంబానికి పంపించారు.


అయితే ఇప్పుడు సదరు రైతు నాగేశ్వరరావు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయన సాయాన్ని తీసుకోలేనని ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికే సోనూసూద్ సాయం విషయంలో నాగేశ్వరావు కుటుంబంపై చాలా విమర్శలు వచ్చాయి. ఆయన వాస్తవానికి అంత కష్టాలలో  లేడని.. ఏదో సరదాగా తీసుకున్న వీడియో వైరల్ కావడం ద్వారా సోనూసూద్ స్పందించారని.. మీడియాలో కథనాలు వచ్చాయి.


ఈ విమర్శలపై నాగేశ్వరరావు మనస్తాపం చెందారు. తాను ఎవరినీ సాయం అడగకపోయినా తనను విమర్శిస్తున్నారని ఆయన బాధపడుతున్నాడు. అంతే కాదు.. నాగేశ్వరరావు గతంలో లోక్ సత్తా పార్టీ తరపున ఎన్నికల్లోనూ పోటీ చేశాడు. ఆయన పౌరహక్కుల నాయకుడుగా కూడా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు అందించే సాయం తీసుకుంటే.. తనపై మరిన్ని విమర్శలు వస్తాయని ఆయన భావించడం వల్ల కావచ్చు.. లేదా కూతుళ్లను హైదరాబాద్ అంత దూరం పంపించే ఆలోచన లేకపోవడం వల్ల  కావచ్చు. మొత్తానికి చంద్రబాబు సాయం తాను తీసుకోలేనని నాగేశ్వరరావు ప్రకటించారు. ఏదేమైనా సోషల్ మీడియా ఎంత ప్రభావవంతమైందో రైతు నాగేశ్వరరావు ఉదంతం మరోసారి రుజువు చేసిందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: