రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌ వాయిదా పడింది. తెలంగాణకు రావాల్సిన బకాయిలపై మంత్రి హరీశ్ రావు.. సమావేశంలో ప్రస్తావించారు. కేంద్రమే రుణాన్ని తీసుకుని, రాష్ట్రానికి రావాల్సిన మొత్తం బకాయిలు చెల్లించాలని హరీశ్ కోరారు. అయితే అందుకు కేంద్రం ససేమిరా అంటోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. పరిహారం చెల్లింపు పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ తీసుకునే నిర్ణయానికి 12 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. అయితే రాష్ట్రాలు లేవనెత్తిన మరికొన్ని డిమాండ్ లు పరిగణనలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమయం కోరింది. మార్కెట్ల నుంచి రుణాలు తీసుకునేందుకు 12 రాష్ట్రాలు అంగీకారం తెలుపగా.. 9 రాష్ట్రాలు మాత్రం కేంద్రమే ఆ రుణాలు తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వాలని పట్టుబట్టాయి.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన 42వ జీఎస్టీ ‌కౌన్సిల్ సమావేశంలో బీఆర్కే భవన్ నుంచి పాల్గొన్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ‌ పరిహార చట్టం ప్రకారం రాష్ట్రాలకు ప్రతీ రెండు నెలలకు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. సెస్‌తోపాటు, జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసే ఇతర నిధులను తప్పనిసరిగా పరిహార నిధిలో జమ చేయాలని అన్నారు. జీఎస్టీ పరిహారం చెల్లింపు కోసం తీసుకునే రుణం, ఆర్టికల్ 293 పరిధిలో ఉండదు కాబట్టి దీన్ని తాను కూడా సమర్థిస్తున్నానని అన్నారు తెలంగాణ ఆర్థికమంత్రి.  

2020-21లో ఏపీకి రావాల్సిన కాంపెన్సేషన్ బకాయిలను కొంతమేర విడుదల చేసినందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు బుగ్గన. మిగిలిన ఐజీఎస్టీ బకాయిలు కూడా త్వరగా విడుదల చేయాలని కోరారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి బుగ్గన పాల్గొన్నారు. కొవిడ్ వల్ల ప్రజారోగ్యం మీద అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుండంతో అదనపు భారం పడుతోందని, క్లిష్ట సమయంలో కేంద్రం అన్ని బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు నిర్మలా సీతారామన్‌. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం రుణం తీసుకోబోదని వివరణ ఇచ్చారు. అయితే రాష్ట్రాలు రుణాలు తీసుకునే విషయంపై కూడా ఏకాభిప్రాయం రాలేదని చెప్పారు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దం లాంటిదేమీ లేదని అన్నారు నిర్మలాసీతారామన్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: