గీతం వర్శిటీ భూమల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అన్యాయం అక్రమంగా ఓ విద్యాసంస్థను జగన్ సర్కారు కూల్చి వేతలతో భయభ్రాంతులకు గురి చేస్తోందని టీడీపీ ఆరోపిస్తున్న వేళ అధికార వైసీపీ కొత్త అస్త్రాలను బయటకు తీస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ప్రజా సంఘాల జేఏసీ గీతం వర్సిటీపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు అలా ఇలా లేవు.. దిమ్మ తిరిగే రేంజ్‌లో ఉన్నాయి. ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు రామారావు వాదనల ప్రకారం విశాఖలో గీతం వర్సిటీ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.

ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు రామారావు వాదన ఇదీ.. “ విశాఖలో గీతం వర్శిటీ దారుణమైన భూ అక్రమాలకు పాల్పడింది. ప్రభుత్వ భూములు కబ్జా చేసింది. అలాగే విద్యారంగంలోనూ అనేక అక్రమాలు చేసింది. నకిలీ సర్టిఫికెట్లు అంటగట్టింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోంది. కరోనా సమయంలోనూ  గీతం వైద్య సంస్థ ఉచితంగా ఏమీ సేవలు చేయలేదు. భారీగా  ఫీజులు ముక్కు పిండి వసూలు చేసింది. గీతం వర్శిటీ విదేశాల నుంచి భారీగా విరాళాలు సేకరించి ఆర్థిక నేరాలకూ పాల్పడింది.. మనీ లాండరింగ్ వంటి దారుణాలకూ పాల్పడింది.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గీతం వర్శిటీని స్వాధీనం చేసుకోవాలి. విశాఖ ఎంపీ లాడ్స్ నిధులు, హుద్ హుద్ తుపాను సహాయ నిధులు కూడా తన రాజకీయ పలుకుబడితో సంస్థకు దారి మళ్లించుకున్నారు.  ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అనేక రాయితీలు పొందినా.. ఏనాడూ విద్యార్థుల ఫీజుల్లో రాయితీలు ఇవ్వలేదు.  గీతం సంస్థ ఇచ్చిన నకిలీ డిగ్రీలతో అనేక మంది విద్యార్థులు నష్టపోయారు. అందుకే.. గీతం వర్శిటీపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు జరిపించాలి.” అని   ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు రామారావు వాదిస్తున్నారు.

మరి ఇప్పుడు ఈ డిమాండ్‌ తెరపైకి వచ్చిందంటే.. అందులో అధికార పార్టీ ప్రోద్బలం లేదని చెప్పలేం. మరి గీతం వర్శిటీపై సీబీఐ విచారణకు సిఫారసు చేయడం.. లేదా వర్శిటీని స్వాధీనం చేసుకోవడం వంటి తీవ్ర చర్యలకు జగన్ సర్కారు సాహసిస్తుందా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: