దుబ్బాక ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా కాక పుట్టిస్తోంది. సిద్ధిపేటలో తనిఖీలు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పట్ల పోలీసుల తీరు ఉద్రిక్తతకు తెరలేపాయి. పోలీసుల తీరుకు నిరసనగా  బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఎన్నికల ప్రధాని అధికారిని కలిసిన బీజేపీ నేతలు సీబీఐ విచారణ కోరారు.

సిద్ధిపేట పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్.. దీక్ష చేపట్టారు. నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పోలీసుల తీరుకు నిరసనగా సంజయ్ దీక్షకు దిగారు. సిద్ధిపేట సీపీని సస్పెండ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.

సంజయ్ దీక్షకు సంఘీభావంగా పార్టీశ్రేణులు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి‌. పలు చోట్ల బీజేపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బీజేపీ కార్యకర్తలు.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కరీంనగర్‌లో దీక్ష చేస్తున్న అధ్యక్షుడుని పార్టీ నాయకులు కలిసి సంఘీభావం ప్రకటించారు. మరోవైపు బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. సిద్దిపేట ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని, దుబ్బాకలో పోలీస్ అబ్జర్వర్ ని నియమించాలని డిమాండ్ చేశారు.

ప్రగతి భవన్, డీజీపీ కార్యాలయాల వద్ద బీజేపీ నేతల నిరసన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించారు. కొందరు ముఖ్య నేతలను ముందుగానే పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

మొత్తానికి దుబ్బాకలో ఉపఎన్నిక జరుగుతుండటంతో అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. సిద్ధిపేట పోలీసుల తీరును నిరసిస్తూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే దీక్షకు దిగారు. దురుసుగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట సీపీని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో రాజకీయ పార్టీ నేతలు ఇప్పటికే మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.











మరింత సమాచారం తెలుసుకోండి: