కరోనా విజృంభణ ప్రమాదకరంగా ఉన్నప్పటికీ... ఈ వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుండటం ఊరటనిస్తోంది. ఈ వైరస్‌కు మందులేదని, సోకినవారు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఈజీగా బయటపడొచ్చని వైద్యులు మొదట నుంచీ చెబుతూనే ఉన్నారు. రికార్డుల ప్రకారం  ఎక్కువ శాతం జరుగుతున్నది కూడా అదే.

మనదేశంలో వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో సుమారు 92 శాతం మంది ఏ మందులు ఉపయోగించలేదు. సాధారణ జ్వరం, జలుబు మాత్రలను మాత్రమే వాడారు. మిగిలిన 8 శాతం మంది రెమిడిసివర్, హైడ్రోక్లోరోక్విన్ వంటి వాటితో కోలుకున్నారు. చనిపోయినవారిలో చాలామంది.. వయసైపోయినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. రికవరీ అయినవారిలో చాలామంది స్వతహాగా ఇమ్యూనిటీ  పెంచుకోవడం వల్లే సేఫ్‌గా బయటపడ్డారన్న  మాట.

ఈ ఔషధాలేవీ రాకముందు చాలా మంది ఆక్సిజన్‌ చికిత్సతోనే కోలుకున్నారు. వెంటిలేటర్‌పైకి వెళ్లిన స్థాయిలోనూ కోలుకున్న వారున్నారు. ఇలాంటివారికి వేల రూపాయలు ఖర్చుచేయాల్సి వచ్చేది. ఇప్పుడు వచ్చిన మందులు కూడా ఇలాంటివారికే తప్ప అతి స్వల్ప లక్షణాలున్నవారికి, అసలు లక్షణాలు  లేనివారికి అవసరమే లేదని తెలిపారు వైద్యులు.

రెమెడెసివిర్‌ కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నవారికి  ప్రయోగాత్మకంగా వాడే మందే తప్ప.. మన శరీరంలోని కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే దివ్య ఔషధాలు కావని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌-19కు లక్షణాల ఆధారంగా చేస్తున్న చికిత్సే తప్ప.. ఆ వైరస్‌ బారి నుంచి కాపాడే సమర్థమైన చికిత్స, వ్యాక్సిన్‌ ఏదీ అందుబాటులోకి రాలేదని హైదరాబాద్‌ నిమ్స్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నిర్ణయాత్మక వ్యవస్థలు దీనిపై క్లారిటీ ఇవ్వాలంటున్నారు.

అయితే సమ్‌థింగ్‌ ఈజ్‌ బెటర్‌ దాన్‌ నథింగ్‌ అన్నట్టు.. ఏమీ లేని వేళ ఉపశమనం కోసం ఇలాంటి ఔషధాలు వెలుగులోకి రావడం మంచిదేనని కూడా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి కొవిడ్‌-19కు నిర్ణీతమైన చికిత్స అంటూ ఏమీలేదు. అలాగని, ఏదో ఒక మందు వచ్చేదాకానో, ప్రయోగాలు పూర్తయ్యేదాకానో ఆగలేని పరిస్థితి. అలా ఆగితే మరెంతో మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకే.. అత్యవసర వినియోగానికి వీటిని అనుమతించారనేది వైద్యుల మాట.





మరింత సమాచారం తెలుసుకోండి: