ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రధానంగా అమెరికా, యూరోప్‌ దేశాల్లో సెకండ్‌ వేవ్.. అత్యంత భయానకంగా మారింది. ఆస్పత్రులకు వచ్చే బాధితుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆస్పత్రులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు.. మరణాలు పెరిగిపోతుండడంపై డబ్ల్యూహెచ్ ఓ ఆందోళన వ్యక్తంచేసింది.

అమెరికాలో కరోనా మృతులు రికార్డు స్థాయిలో రెండున్నర లక్షలు దాటేశాయి. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా పదమూడున్నర లక్షల మందిని కరోనా బలిగొంటే...వారిలో రెండున్నర లక్షల మంది అమెరికన్లే ఉన్నారు. ప్రతి నిమిషానికి ఒక అమెరికన్‌ కరోనా కాటుకు బలవుతున్నట్టు విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు కోటీ పదిహేను లక్షల మందికి  వైరస్‌ సోకింది. రోజుకు లక్షన్నర కేసులు నమోదవుతుండడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం రోజుకి 1,700 మరణాలు నమోదవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కరోనా రోగుల చేరిక అమాంతం పెరగడంతో ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి.

యూరోప్‌ను కరోనా సెకండ్‌ వేవ్ గడగడలాడిస్తోంది. కేసుల సంఖ్యతోపాటు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందరికీ వైద్యం అందించే పరిస్థితి లేక ఆరోగ్యవ్యవస్థలు సతమతమవుతున్నాయి. దీంతో  అక్కడున్న విదేశీయులను వెనక్కు పంపించేస్తున్నాయి. ఉద్యోగులు, కూలీలు, ఇతరత్రా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం ఆ దేశాలకు వెళ్లిన ఇక్కడి వారు తిరిగొస్తున్నారు. అక్కడ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్న వారిని కూడా పంపించేస్తున్నారంటే కరోనా సెకండ్‌ వేవ్‌తో ఆ దేశాలు ఎలా వణికిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం హైదరాబాద్‌కు ప్రతిరోజూ విదేశాల నుంచి 11 అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. అందులో నిత్యం దాదాపు 2 వేల మంది ప్రయాణికులు వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆయా దేశాల్లో కరోనా నెగెటివ్‌ టెస్టు రిపోర్టులు పట్టుకొని వస్తుండగా, కొందరైతే హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగాక పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆఫ్రికా ఖండంలో కరోనా కేసులు 20 లక్షల మార్కుని దాటేశాయి. 48 వేల మంది చనిపోయారు. .



మరింత సమాచారం తెలుసుకోండి: