బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గడిచిన బీహార్ అసీంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే నా చివరి ఎన్నికలు అంటూ ప్రగల్భాలు పలికి, ఎలాగోలా ప్రజల్లో ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి మళ్ళీ బీహార్ కి సీఎం అయ్యారు. అయితే సీఎం అయితే అయ్యారు కానీ బీహార్లో కీలకమైన వ్యవహారాలన్నీ బీజేపీ నాయకులే చూసుకుంటున్నారనే అపవాదులు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటినీ పెడచెవిన పెట్టి తన స్టైల్లో పాలన కొనసాగిస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా జరిగిన ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి హత్య జరిగిన విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా సాక్ష్యాత్తు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంటికి దగ్గరగా జరగడంతో రాజకీయంగా పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ హత్యకు సంబంధించి మీడియా జర్నలిస్టులు వరుస ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో, వాటికి సమాధానాలు చెప్పలేక ఒకానొక దశలో వారిపై మాటల దాడికి దిగారు. మాములుగా అయితే ఎంత పెద్ద నాయకుడైనా మీడియా ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. మన భారత ప్రధాని మోదీ కూడా ఎక్కువగా మీడియా ముందు మాట్లాడడానికి ఇష్టపడరు. అందుకే ఈయన ఎప్పటికప్పుడు తన సందేశాన్ని సామాజిక మాధ్యమాల రూపంలో తెలియచేస్తూ ఉంటారు.

ఇందుకు పూర్తి భిన్నంగా నితీష్ కుమార్ జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జర్నలిస్టులుగా మీరు ఎవరికి మద్దతుగా ఉన్నారని వారిని నిలదీసి అడిగారు. మీరు ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకోండి...ఇలాంటి ప్రశ్నలు అడగడం సబబు కాదు అని వారిని తిరిగి ప్రశ్నించారు. మీ మాటలు పోలీసులను కించపరిచేలా ఉన్నాయని, 2005 కు ముందు కూడా ఎన్నో నేరాలు మరియు హింసాత్మక ఘటనలు జరిగాయి...ఇదే విధంగా వాటి గురించి మీరెందుకు ప్రశ్నించరు అని దుయ్యబట్టారు. మరి ఈ వ్యాఖ్యలపై జర్నలిస్టుల సంఘం ఏమైనా చర్య తీసుకుంటుందా..? ఏవిధంగా స్పందించనుంది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: