అనూహ్య‌మైన నిర్ణ‌యం దిశ‌గా వైఎస్ వివేకానంద‌రెడ్డి కుటుంబం అడుగులు వేస్తున్న‌ట్టు క‌డ‌ప రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. వైఎస్ వివేకానంద హ‌త్య‌.. త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ కు టుంబం తీవ్ర‌స్తాయిలో మ‌ధ‌న‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వివేకా.. త‌న సొంత ఇంట్లోనే హ‌త్య‌కు గుర‌య్యారు. అప్ప‌ట్లో చంద్రబాబు ప్ర‌భుత్వం ఉన్న నేప‌థ్యంలో, ఎన్నిక‌ల‌కు ప్ర‌చారం జోరుగా సాగుతున్న స‌మ‌యంలో ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వివేకా కేసులో నేర‌స్తులు ఎవ‌రు?  అస‌లు ఏం జ‌రిగింది? అనే విష‌యం బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా పోయింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వేసిన ద‌ర్యాప్తు క‌మిటీల‌కు తోడు జ‌గ‌న్ కూడా అనేక క‌మిటీలు ఏర్పాటు చేశారు, ఇక‌, హైకోర్టు జోక్యంతో సీబీఐ.. కూడా ద‌ర్యాప్తు ప్రారంభించింది. అనేక మార్లు క‌డ‌ప‌కు వ‌చ్చి విచార‌ణ కూడా చేప‌ట్టింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నివేదిక కూడా అధికారులు బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. సీబీఐపై రాజ‌కీయంగా ఒత్తిడి పెరిగింద‌నే విమ ర్శ‌లు క‌డ‌ప‌లో రాజ‌కీయ నేత‌ల నుంచి వినిపిస్తున్నాయి.

మ‌రీ ముఖ్యంగా వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత‌.. ఆదిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం పెట్టుకున్నా.. రాను రాను.. సర్కారు వ్య‌వ‌హార శైలిపై అసంతృప్తి నుంచి అనుమానం దిశ‌గా ఆమె ప్ర‌యాణం చేస్తున్నారు. సా క్ష్యాల‌ను ఇప్ప‌టికే ధ్వంసం చేశార‌ని కేసు విచారించ‌డంలో ఏపీ పోలీసులపై రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్నాయ ని.. ఆమె త‌ర‌చుగా ఆరోపిస్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల కేర‌ళ‌కు చెందిన సామాజిక ఉద్య‌మ‌కారుడిని క‌లిసి.. త‌మ‌కు న్యాయం చేసేలా చూడాల‌ని అభ్య‌ర్థించిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే మ‌రోవైపు రాజ‌కీయంగా కూడా ప‌ట్టు పెంచుకునేందుకు సునీత అడుగులు వేస్తున్నార‌ని .. క‌డ‌ప‌లోని వివేకా స‌న్నిహిత కుటుంబాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే రాజ‌కీయంగా వివేకా కుమార్తె బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌ని.. తెలుస్తోంది. త‌ద్వారా.. క‌డ‌ప‌ నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేసి విజయం సాధించ‌డం ద్వారా.. త‌న తండ్రి కేసులో రాజ‌కీయ ఒత్తిడి లేకుండా చేసుకోవాల‌ని భావిస్తున్న ‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ వార్త క‌డ‌ప రాజ‌కీయాల్లో భారీగా వైర‌ల్ అవుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: