ఇంటర్నెట్ డెస్క్: ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ పేరుతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా ప్రయివేటు పరం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఊహించని ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ప్రతిపక్షాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక యూనియన్లు, ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే విపరీతంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకారణకు సంబంధించి సినీ నటుడు శివాజీ ఎప్పుడో చెప్పారట.

సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్ర రాజకీయాల్లో శివాజీ పేరు విపరీతంగా వినిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను చంపేస్తున్నారంటూ ఏడాది క్రితమే నటుడు శివాజీ చెప్పారట. అప్పట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ యూట్యూబ్ చానల్‌ అప్పట్లో శివాజీని   ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియోని 2020 జనవరి 30న పోస్ట్ చేసింది. ఆ వీడియోలో నటుడు శివాజీ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు.

దక్షిణ కొరియాకు చెందిన పోస్కో అనే ఓ ఉక్కు కంపెనీని దేశానికి తీసుకురావడం కోసం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చంపేస్తున్నారంటూ శివాజీ చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం 40వేల మంది ఉద్యోగులు, లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న గొప్ప కర్మాగారం. అలాంటి సంస్థ మూతపడబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. '2011, 2012 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం రూ.1000 కోట్ల లాభాల్లో ఉంది. కానీ ఇప్పుడు ఆ లాభాలు పడిపోయాయి. త్వరలో ఇది చనిపోబోతోంది. మీకు ఎవరికైనా ఈ విషయం తెలుసా? విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేవు. గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ నెంబర్ వన్ అవుతుంది. కానీ ఆ దిశగా ఎవరూ కృషిచేయడం లేదు. దీని వెనుక ఉన్న రహస్యమే పోస్కో స్టీల్ ప్లాంట్.

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి రావడం వెనుక అదే కారణమని శివాజీ అనడం ఆ వీడియోలో ఉంది. మర్యాదపూర్వకంగానే సీఎంను కలవడానికి వచ్చానని కేంద్ర మంత్రి చెప్పినా అందులో అసలు పరమార్థం ఇదేనని శివాజీ అన్నారు. 'ఆంధ్రాలో భూములు 2వేల ఎకరాలు ఇస్తే.. పోస్కో కంపెనీ వస్తుందని ఒప్పందం కుదుర్చుకునేందుకే ఇక్కడికి సదరు మంత్రి వచ్చార' ని శివాజీ ఆ వీడియోలో చెప్పారు.

అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులకు 150 గజాలో, 200 గజాలో ఇచ్చారని శివాజీ చెప్పారు. ‘ఈ రోజు విశాఖ ఉక్కు చనిపోతోంది. ఎంతమంది రైతులు వారికి అండగా ఉంటారో చూస్తాను. నిలబడండి. నిలబడితేనే ఈ కంపెనీ నిలబడుతుంది. పోస్కో అనే కంపెనీ వద్దని ఒడిశాలో తంతే ఇక్కడకు వచ్చింది. ఈ విశాఖపట్నానికి ఎవరు మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారో తెలుసుకోండి. ఆ వ్యక్తి పేరు నేను చెప్పను. ఆయన తెలుగు వ్యక్తి. ఢిల్లీలో పదవి ఉన్న వ్యక్తి. విశాఖ మీద అపరిమితమైన ప్రేమ ఉన్న వైసీపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ మూతపడకుండా కాపాడమనండి. అయినా వాళ్ళ ఆటలన్నీ విశాఖ కోసం కాదు.. పోస్కో కోసం. ఆల్రెడీ ఉక్కు కంపెనీ ఉంటే మళ్లీ ఇంకో ఉక్కు కంపెనీ ఎందుకు తేవాలని అనుకుంటున్నారు..?’ అని శివాజీ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రైతులు 60వేల ఎకరాల భూములిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర, తెలంగాణకు చెందిన నేతలు పోరాటాలు చేశారు. ఆ పోరాటాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం త్వరలో కనుమరుగు కాబోతోంది. కాదని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి' అంటూ శివాజీ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే అమరావతి గురించి కూడా శివాజీ మాట్లాడారు. అమరావతిలో 30వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రస్తుతం అన్యాయం జరుగుతోందని, రేపు విశాఖలో 60వేల ఎకరాలు ఇచ్చిన వారికి అన్యాయం జరుగుతుందని శివాజీ ఆ వీడియోలో చెప్పారు.

ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ను కూడా శివాజీ విమర్శించారు. బీజేపీతో పొత్తు రాజకీయాలు చేస్తున్న జనసేన కానీ, ఆ పార్టీ అధినేత జనసేనాని కానీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ మూతపడకుండా ఆపే ధైర్యం చేయగలరా అంటూ నిలదీశారు.

అప్పట్లో శివాజీ చెప్పినట్లే ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుండడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కావడంలో వైసీపీ, జనసేనల పాత్రపైనా అనుమానాలు కలుగుతున్నాయి.

  

మరింత సమాచారం తెలుసుకోండి: