మన దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ టెన్షన్‌ పుట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గి.. పలు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది మహమ్మారి. దేశవ్యాప్తంగా వరుసగా రెండో రోజు 16వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ విజృంభణ ఎక్కువగా కనిపిస్తోంది.

వెళ్లిపోయిందనుకున్న కరోనా.. మళ్లీ వేళ్లూనుకుంటోంది. దేశవ్యాప్తంగా మరోసారి కలవరపెడుతోంది. వరసగా రెండో రోజు కొత్త కేసులు 16 వేలకు పైగా నమోదయ్యాయి. కొన్నాళ్లుగా రోజూవారి మరణాల సంఖ్య కూడా 100కి పైగానే నమోదవుతుండటం.. మరింత భయపెడుతోంది. తాజాగా, 8లక్షల 31వేల 807 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..16వేల 577 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మహమ్మారికి మరో 120 మంది బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య లక్షా 56వేల 825కి పెరిగింది.

కొవిడ్‌ కేసుల విజృంభణతో.. యాక్టివ్‌ కేసుల రేటులో పెరుగుదల, రికవరీ రేటులో తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులతో పోల్చితే రికవరీలు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 12వేల 179 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్ నుంచి బయటపడినవారి సంఖ్య కోటి ఏడు లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో లక్షా 55వేల 986 యాక్టివ్‌ కేసులుండగా.. ఆ రేటు 1.41 శాతానికి చేరింది.

మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి ఉధృతి పెంచింది. కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ 9 వేలకు చేరింది. గత 3రోజులుగా కొత్త కేసులు 8 వేలకుపైగా నమోదయ్యాయి. రెండ్రోజుల వ్యవధిలోనే కొత్తగా 8వేల 333 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21లక్షల 38వేల 154కు చేరగా మరణాల సంఖ్య 52 వేలు దాటింది. ముంబైలోనే గత 24 గంటల్లో వెయ్యికి పైగా కరోనా కేసుల నమోదయ్యాయి. దీంతో, కఠిన నిబంధనలు అమలుచేస్తోంది మహారాష్ట్ర సర్కార్‌. పలు చోట్ల కర్ఫ్యూ విధించారు. అవసరమైన సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: