భారతదేశంలో
ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతోమంది కరోనా రోగులు అత్యంత దయనీయమైన పరిస్థితులలో ప్రాణాలు వదులుతున్నారు. అందరూ చూస్తుండగానే
ఆక్సిజన్ అందక చాలా మంది రోగులు ఆసుపత్రుల ఎదుటే చనిపోయారు. ఈ హృదయ విదారకమైన దృశ్యాలకు సంబంధించి అనేక వీడియోలు నెట్టింట ప్రత్యక్షమై అందరిని కంటతడి పెట్టించాయి. ఇప్పటికీ దేశంలో
ఆక్సిజన్ లభించక రోగులు ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు.
అయితే సీరియస్ పరిస్థితుల్లో ఉన్న రోగులను కాపాడేందుకు స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వస్తున్నారు. నటుడు సోనూ సూద్ కూడా ఛారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాలంటీర్ల సహాయంతో అవసరంలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్నారు. గతేడాది లాక్ డౌన్ కాలంలో వలస కార్మికులను చూసి చలించిపోయిన ఈ రీల్ విలన్ రియల్
హీరో అయ్యారు. ఆ రోజు నుంచి ఇప్పటికీ ఆయన పేద ప్రజల ప్రాణాలు కాపాడుతూనే ఉన్నారు. తాజాగా ఆయన ఏర్పాటు చేసిన ఛారిటీ ఫౌండేషన్ వలన 22 మంది కరోనా రోగులు మృత్యువును జయించగలిగారు.
పూర్తి సమాచారం తెలుసుకుంటే.. కర్ణాటకలోని సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్‌కు చెందిన హష్మత్ రాజాకు ఒక
స్థానిక పోలీసు అధికారి
ఫోన్ చేసి
ఆక్సిజన్ సిలిండర్లు ఎఆర్ఎకే ఆసుపత్రికి అత్యవసరంగా కావాలని..
ఆక్సిజన్ కొరత కారణంగా ఆసుపత్రిలో ఇప్పటికే ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారని.. మరో 20 మంది కోవిడ్-19 రోగులను ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని త్వరగా
ఆక్సిజన్ సిలిండర్లు అందించి వారి ప్రాణాలు నిలబెట్టాలని కోరారు.
దీంతో సోనూ సూద్ టీం వెంటనే స్పందించి 16
ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రికి అందజేశాయి. ఆఖరి నిమిషంలో
ఆక్సిజన్ అందటం తో 20 మంది కరోనా రోగులు బతికి బట్ట కట్టారు. ఒకవేళ సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్ లేకపోయినట్లయితే 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. అయితే తమ టీం సభ్యులు సమయానికి
ఆక్సిజన్ సిలిండర్లు ఆసుపత్రికి చేరవేసినందుకుగాను సోనూ సూద్ కృతజ్ఞతలు తెలిపారు.