మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ ఢిల్లీలో బీజేపీలో చేరబోతున్నారు. ఈటల రాజేందర్‌తో పాటు  మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అందే బాబు, కేశవరెడ్డి, గండ్ర నళినితో పాటు ఇంకొందరు ఓయూ ఐకాస నేతలు బీజేపీలో చేరబోతున్నారు. శామీర్ పేటలోని ఆయన నివాసం నుంచి శంషాబాద్ వెళ్లిన ఈటల.. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ ఉదయం 11.30కి భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.

టీఆర్‌ఎస్‌ నుంచి బలవంతంగా బయటకు పంపిన తర్వాత ఈటల కొన్ని రోజులుగా భవిష్యత్ వ్యూహంపై మథనం జరిపారు. అనేక విధాలుగా ఆలోచించిన తర్వాత చివరకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ టార్గెట్ చేసి మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడతారన్న వార్తలు షికారు చేశాయి. కానీ ఎందుకో ఈటల సొంత పార్టీ పెట్టే ఆలోచన చేయలేదు. బహుశా అంగ బలం, అర్థబలం చాలవనుకున్నారు కావచ్చు. చివరకు సొంత పార్టీ  నిర్ణయం విరమించుకున్నారు.

కేసీఆర్ వంటి నాయకుడిని ఎదిరించాలంటే ఓ బలమైన అండ అవసరమని ఈటల భావించి ఉండొచ్చు.  అందుకే  కేసీఆర్ ఎత్తులను నుంచి కాపాడుకునేందుకు ఆయన బీజేపీలో చేరుతున్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఈటల కొంత ఆలస్యం చేశారు. కేసీఆర్ లాంటి వాడితో పెట్టుకునేటప్పుడు వ్యూహాలు చకచకా ఉండాలంటారు. కానీ ఈటల ఈ విషయలో కాస్త ఆచి తూచి స్పందించారు.

అవును మరి.. కేసీఆర్ లాంటి వాడితో పెట్టుకోవాలంటేనే ఎన్నో ఆలోచించాలి కదా. ఎంతో మథనం చేయాలి కదా. అప్పుడు కానీ ఎవరైనా ఓ నిర్ణయానికి రాకూడదనుకున్నారు ఈటల.  అయితే.. అదంతా ఆలోచించే వరకే ఉండాలి.  ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఈటల ఈటెలా దూసుకుపోవచ్చు. మొత్తానికి ఈటల రాజేందర్‌ బీజేపీ వైపు మొగ్గారు. మరి ఈటల బీజేపీలో ఎలా నెగ్గుకొస్తాడో.. కేసీఆర్ ను ఎలా ఢీ కొడతాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: