తాజాగా నెల్లూరు జిల్లాలో 8 నెలల గర్భిణీ కోవూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. అన్యాయంగా, అక్రమంగా తన భర్త కరటం మల్లికార్జునను పోలీసులు అరెస్టు చేశారని ఆమె ఆరోపించింది. తన భర్త రాజకీయంగా ఎదుగుతున్నారని ఓర్వలేక ఎమ్మెల్యే ప్రసన్న అనుచరులు అతడిని బాగా కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించింది. ఎమ్మెల్యే అనుచరులు తన భర్తను కొట్టి పోలీస్ స్టేషన్ లో విడిచిపెట్టి వెళ్లారని.. తర్వాత పోలీసులు తన భర్త పై రౌడీషీట్ తెరిచారని ఆమె ఆరోపించింది. తన భర్త పై ఎలాంటి కేసులు లేకపోయినా పోలీసులు అరెస్టు చేశారని.. అతడిని వెంటనే విడిచి పెట్టాలని ఆమె ఆందోళనకు దిగింది.

అయితే ఈ విషయంపై స్పందించిన టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. మ‌ల్లి అనే ఒక యువకుడు బలవంతపు ఏకగ్రీవాలకు ఒప్పుకోలేదని.. టీడీపీ పార్టీ కోసం పని చేస్తున్నాడని.. అతనిపై కక్షగట్టి.. అక్రమంగా నిర్బంధించి.. తప్పుడు కేసులు బనాయించి దారుణంగా హింసిస్తున్నారు అని.. ఈ అరాచకాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు.


మ‌ల్లి భార్య రమ్య ఒక నిండు గర్భిణి అని.. అలాంటి గర్భవతి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినా.. నిమ్మకు నీరెత్తినట్టు పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని.. ఒక నిండు గర్భిణీ ఆందోళనకు స్పందించకపోవడం వైసీపీ అరాచక పాలన కి మరో నిదర్శనమని ఆయన ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. మల్లికార్జునను తక్షణమే విడిచిపెట్టి.. బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

ఈ విషయంతో పాటు మరిన్ని విషయాలపై నారా లోకేష్ ట్వీట్ చేస్తున్నారు. విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని ఆయన ప్రతిరోజూ ట్విట్టర్ వేదికగా పోస్ట్స్ పెడుతూనే ఉన్నారు. అయితే అధికార పార్టీ నేతలు కూడా అడపాదడపా నారా లోకేష్ కి కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: