కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయంలో కూడా ఏపీలోని ప్రతిపక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటాయి. ఆ విషయంలో తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య ఐక్యత అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ వైరిపక్షాలే అయినా, రాష్ట్ర సమస్యల విషయంలో మాత్రం అక్కడి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయి. అయితే ఏపీలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి వ్యవహారం లేదు. తాజాగా ప్రతిపక్షనేత చంద్రబాబు.. వైసీపీతో కలసి పనిచేస్తామంటున్నారు. జగన్ కూడా తమతో కలసి రావాలంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు ఉమ్మడి పోరాటం చేద్దామంటున్నారు బాబు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోడానికి అవసరమైతే పదవులకు సైతం రాజీనామా చేస్తామని చెప్పారు చంద్రబాబు. సీఎం జగన్ సైతం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. ఉక్కు ఉద్యమాన్ని జగన్ ముందుండి నడిపించాలన్నారు చంద్రబాబు. ఈమేరకు ఆయన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు నిజంగా కలసి పనిచేయాలనుకుంటే నేరుగా జగన్ కే లేఖ రాయాలి, ఆయనతోనే మాట్లాడాలి. ఆయితే బాబు మాత్రం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితికి లేఖ రాసి జగన్ ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని కోరారు. చంద్రబాబు కోరినట్టు జగన్ ఈ ఉద్యమంకోసం ముందుకొస్తారా, అన్ని పార్టీలు కలసి పనిచేస్తాయా అనేది అనుమానమే.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి వైసీపీ తమ చిత్తశుద్ధి నిరూపించుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం అక్కడా ఇక్కడా డబుల్ గేమ్ ఆడుతోంది. ఓవైపు కేంద్ర మంత్రులు ప్రైవేటీకరణ ఖాయమేనంటారు, మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు వినతిపత్రాలకు ఢిల్లీ వెళ్తారు. వీటిలో ఏది నిజం, ఎంత నిజం అనేతి తేలాల్సి ఉంది. ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోడానికి ఇప్పటికైనా ఉమ్మడి పోరాటం అనే అంశం తెరపైకి రావడం నిజంగా ఆహ్వానించాల్సిన పరిణామమే. పార్లమెంట్ లో ఏపీ ఎంపీలంతా ఉమ్మడిపోరాటం చేస్తే ఉక్కు ఫ్యాక్టరీయే సాదు, ప్రత్యేక హోదా కూడా రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: