తనను వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నా సరే మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోంది అని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం చెబుతుంటే వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకారం అందిస్తోంది అని అన్నారు ఆయన.

ప్రజల దృష్టిని మళ్లించేందుకు తూతుమంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకొన్నారు అని రవీంద్ర దుమ్మెత్తి పోశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేసి మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది ?  అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి జగన్ తన కేసులకు భయపడి కేంద్రం అడమనట్లు ఆడుతున్నారన్న ఆయన పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటూ స్పష్టం చేసారు. ప్రాజెక్టు సంబందించి 2014 అంచనా వ్యయమే భరిస్తామని కేంద్రం చెప్పడం దుర్మార్గం అంటూ విమర్శించారు.

టీడీపీ హయాంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు అని గుర్తు చేసిన ఆయన చేతకాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పరిస్థితి ఇలాగే ఉంటుంది అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడలేని వైసీపీ ఎంపీలు సిగ్గుపడాలి అని ఎద్దేవా చేసారు.. ప్రాజెక్టులు కట్టడం అంటే ప్రజా వేదిక కూల్చినంత ఈజీ కాదన్న సంగతి వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి  అని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యం అవుతుందన్నారు రవీంద్ర. విశాఖ స్టీల్ ప్లాంట్ సాధన కోసం టీడీపీ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: