ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే ప్రశ్న. మరీ ముఖ్యంగా గురువారం సాయంత్రం నుంచి ఇదే మాటపై వైసీపీ నేతలంతా చర్చించుకుంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో తిరుగులేని విజయం సాధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఒక్కఛాన్స్ అంటూ జగన్ చేసిన విజ్ఞప్తి... పార్టీకి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచేలా చేసింది. అయితే అధికారం చేపట్టడానికి ముందే... పార్టీ నేతలతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం ఎదురు చూస్తున్న వారూ ఎవరూ నిరాశ పడవద్దని... ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవకాశం వస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న మంత్రివర్గం కూడా రెండున్నర ఏళ్ల పాటు మాత్రమే ఉంటుందని... ఆ తర్వాత కొత్త వారికి అవకాశం ఇస్తామన్నారు. జగన్ చెప్పిన సమయం దగ్గర పడింది. మరో నెల రోజుల్లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఇదే ఇప్పుడు పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.

ఇప్పటికే మంత్రి పదవుల కోసం ఎంతో మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కొంతమంది అయితే పార్టీ స్థాపించక ముందు నుంచి కూడా జగన్‌తోనే ఉన్నామని... అందుకని తప్పనిసరిగా తమకు పదవులు వస్తాయని ధీమాతో ఉన్నారు. అసలు మొదటి విడతలోనే దక్కని వారు అయితే... అప్పట్లోనే కాస్త మౌనం వహించారు కూడా. ఇక ఇప్పుడు ఉన్న కేబినెట్‌లో 20ల శాతం మంది మాత్రమే ఉంటారని జగన్ స్పష్టం చేశారు. అంటే ఆ వెళ్లిపోయే 80 శాతం మంది ఎవరూ... అనేది ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న. నేనుంటాను ఒక సీనియర్ బలంగా చెబుతుంటే... నేనుంటానా అని మరో సీనియర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా జిల్లాలో నేనే సీనియర్‌ను... అందుకే జగన్ నాకు ఫస్ట్ ఫేజ్‌లోనే పదవి ఇచ్చారు... కాబట్టి నేను ఉంటా అని మరో నేత తమ అనుచరుల వద్ద కామెంట్లు చేస్తున్నాడు. పదవి ఉన్నా... లేకపోయినా సరే... నేను పార్టీ కోసమే పనిచేస్తా అంటూ కొంతమంది నేతలు పైకి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నప్పటికీ... లోపల మాత్రం పదవి ఉండాలని ఇప్పటికే అందరు దేవుళ్లను మొక్కుకుంటున్నారు. ఇప్పుడు పదవి లేకపోతే... రాబోయే ఎన్నికల సమయానికి జిల్లాలో చక్రం తిప్పలేమని... కాబట్టి... రెండో దఫాలో పదవి ఉంటేనే బాగుంటుందనేది కొందరి మాట. చూడాలి మరి... జగన్ కేబినెట్‌లో ఎవరుంటారు... ఎవరు పోతారో మరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: