
జల వివాదాలకు ఆనవాలుగా ఒడిశా నిలుస్తోంది. ప్రాజెక్టులపై ఆంధ్రాకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్మాణాలకు ప్లాన్ చేస్తోంది. మన పాలకుల అసమర్థత కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని విపక్షం గొంతెత్తినా, అవేవీ ఫలించేలా లేవు. నేరడి బ్యారేజీ నిర్మాణం సాగకపోతే వంశధార ప్రాజెక్టు నిల్వ సామర్థ్యంపై ప్రభావం పడనుంది. గతంలో ట్రై బ్యునల్ ఆంధ్రాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యారేజీ నిర్మించుకోవచ్చని కూడా పేర్కొంది. కానీ ఇప్పుడు ఒడిశా ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ఎన్నో వేల ఎకరాల భవిష్యత్తు అగమ్య గోచరం కానుంది.
ఎప్పటి నుంచో ఒడిశా నిర్వహిస్తున్న ప్రాజెక్టులు, కొత్తగా ఎగువన చేపట్టాలనుకుంటున్న ప్రాజెక్టులపై సందేహాలు ఉన్నాయి. తాజాగా ఒడిశా ప్రభుత్వం ఓ అడుగు ముం దుకు వేసి, తనదైన మార్కు రాజకీయం నడుపుతోంది. జల వివాదం జఠిలం అవుతోంది. ఇప్పటికే సరిహద్దు వివాదాలతో సతమతం అవుతున్న అధికారులకు ఇదొక కొత్త వివాదం కానుంది. ముఖ్యంగా కోర్టులు, ట్రైబ్యూనళ్లు ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేదు. ఇరు రాష్ట్రాల పెద్దలు సానుకూలంగా ఆలోచించి నిర్ణయించాల్సిన తరుణంలో అస్సలు జగన్ అటుగా అడుగులే వేయడం లేదు. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతం భారీగా నష్టపోనుంది. ఎగువన రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కట్టుకుంటే దిగువన ఉన్న రాష్ట్రాల హక్కులు ఏం కావాలి?