వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ల తర్వాత... కొత్త విధానంతో దూసుకువెళ్తోంది. ఐదేళ్ల పదవి కాలంలో తొలి అర్ధ భాగం అంతా కూడా... పరిపాలనపై పట్టు సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనే దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొలి ఏడాదిలో 90 శాతం వరకు అమలు చేశామంటున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టని ఇరుకున పెట్టేలా పావులు కదిపారు. రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా చక్రం తిప్పారు వైఎస్ జగన్. మునిసిపల్ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే.. వచ్చింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ పోరులో.. తెలుగుదేశం పార్టీ కుదేలైంది. ఇక పరిషత్ పోరులో నిలిచేందుకు కూడా టీడీపీ భయపడింది. చివరికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది కూడా.

ఇప్పుడు తెలుగు దేశం పార్టీతో ఏ మాత్రం భయపడాల్సిన పని లేదని భావించినట్లుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీని పూర్తిగా పక్కన పెట్టేశారు వైసీపీ నేతలు. ఇక ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీని టార్గెట్ చేసింది వైసీపీ. పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించి చేసిన కామెంట్లను తీవ్రంగా పరిగణించిన వైసీపీ నేతలు... వరుసగా ప్రెస్ మీట్లు పెట్టేశారు. మాటలతో, ప్రశ్నలతో ఎదురు దాడి చేస్తున్నారు. మేమేం చేశామో నిరూపిస్తాం... మీరు రెడీనా అంటూ పవన్‌కు సవాల్ విసిరారు కూడా. అదే సమయంలో పవన్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీని మాత్రమే పల్లెతు మాట అనటం లేదు. ఇక జనసేన పార్టీ అధినేతను అయితే... రెండు చోట్ల పోటీ చేసి గెలవలేకపోయారు.. మీరు కూడా లీడరేనా అంటూ దెప్పి పొడుస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నయా టార్గెట్ జనసేన పార్టీ అనేది రాజకీయ విశ్లేషకుల మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: