ఏపీ స్టేట్ లో కృష్ణపట్నం ఆనందయ్య అంటే తెలియని వారు ఎవరూ కూడా ఉండరు. ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తున్న కరోనా మహమ్మారి కి మెడిసిన్ కనిపెట్టాడు కృష్ణపట్నం  ఆనందయ్య. దీంతో దేశవ్యాప్తంగా ఆనందయ్య పేరు మార్మోగింది. అంతేకాదు గత ఆరు నెలల కింద ఆనందయ్య మందు పంపిణీ ఈ విషయంపై తీవ్ర దుమారం కూడా రేపిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు పంపిణీ వ్యవహారం కోర్టు దాకా వెళ్లడంతో ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. అయినప్పటికీ ఆనందయ్య ముందు పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... కంట్లో వేసే మందు పై మాత్రం స్టే ఇచ్చేసింది.
 
కంట్లో వేసే ఆనందయ్య మందు పై పరీక్షలు జరుగుతున్నాయని... త్వరలోనే దీనిపై నివేదిక ఇస్తామని హైకోర్టుకు స్పష్టం చేసింది జగన్ సర్కార్. అయితే గత కొన్ని రోజులుగా కరోనా సెకండ్  వేవ్.. పూర్తిగా తగ్గిపోవడంతో... ఆనందయ్య మందు విషయంపై ఎవరూ కూడా మాట్లాడడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుకోవడంతో ఆనందయ్య మందు విషయం ఎక్కడా కూడా చర్చకు రావడం లేదు. ఇది ఇలా ఉండగా తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ఆనందయ్య. జగన్ సర్కార్ పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు కృష్ణపట్నం ఆనందయ్య. సోమవారం రోజున విజయనగరం పట్టణం లో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమీక్ష సమావేశానికి కృష్ణపట్నం ఆనందయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కృష్ణపట్నం ఆనందయ్య. జగన్ సర్కార్ తనపై... ఉక్కు పాదం మోపే ప్రయత్నం చేస్తోందని... ఎన్నోసార్లు అరెస్టు చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. రకరకాల కేసులు పెట్టి తనను అరెస్టు చేయాలని ఇప్పటికి కూడా ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనందయ్య. అయితే కృష్ణ పట్నం గ్రామస్థుల మద్దతు తనకు బాగా ఉండటంతో... పోలీసులు కూడా అరెస్టు చేయడానికి భయపడుతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆనందయ్య. ఇక ఆనందయ్య చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: