ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న కారణంగా తమిళనాడులోని మదురై జిల్లా యంత్రాంగం వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారు రానున్న వారం రోజుల్లో తీసుకోవాలంది. ఒక్క డోస్ పైనా తీసుకోకుంటే వచ్చే వారం నుంచి మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, మార్కెట్లు లాంటి 18ప్రదేశాలకు ప్రవేశం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వమూ ఇలాంటి ఆంక్షలు విధించింది.

ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఉమ్మడి నిజామాబాద్  జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. టీకా తీసుకుంటేనే రేషన్ ఇవ్వాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలను స్థానికంగా అమలు చేస్తూ.. రేషన్ షాపుల దగ్గరే ప్రజలకు టీకాలు వేస్తున్నారు. రేషన్ కోసం తప్పని పరిస్థితుల్లో ప్రజలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.

మరోవైపు ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుందని.. అయితే మరణాల రేటు చాలా తక్కువగా ఉంటుందని బీబీ నగర్ ఎయిమ్స్ వైద్యుడు వికాస్ భాటియా అన్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉందన్నారు. 30 దేశాలకు ఒమిక్రన్ సోకిందని.. ఒక్క మరణం కూడా సంభవించకపోవడం శుభపరిణామమని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం కూడా పెద్దగా ఉండదన్నారు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వాలు థర్డ్ వేవ్ కు సిద్ధమైతే మంచిదన్నారు.

ఇక మన దేశంలో నిన్నటి కంటే ఈ రోజు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24గంటల్లో 8వేల 603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక నిన్న కరోనాతో 415మంది మరణించారు. అలాగే గత 24గంటల్లో 8వేల 190 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 99వేల 974యాక్టివ్ కేసులున్నాయి. అటు గత 24గంటల్లో 73లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. మొత్తం ఇప్పటి వరకు 126.53కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.












మరింత సమాచారం తెలుసుకోండి: