
ఇక సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా రెండేళ్లు సమయం ఉన్న నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేగంగా మారుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. ప్రస్తుతం వైసీపీతో సమదూరం పాటిస్తున్న టీడీపీ, బీజేపీలు ఇప్పుడు తమ రూటు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా యుద్ధం ప్రకటిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు విడివిడిగా పోరాటం చేసిన రెండు పార్టీలు... ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కలిసి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నాయి. కొద్ది రోజులుగా బీజేపీ అగ్రనేతలు సైతం టీడీపీని కనీసం ఒక్క మాట కూడా అనటం లేదు. పైగా తమ ప్రధాన శత్రువు కేవలం వైసీపీ మాత్రమే అని ప్రకటిస్తున్నారు. దీంతో ఇప్పుడు అధికార వైసీపీలో కాస్త కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది. ఇందుకు నిన్నటి ప్రభుత్వ ప్రధాన సలహాదారుల సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ బీజేపీ నేతలు చదువుతున్నారని సజ్జల కామెంట్ చేశారు.