గుంటూరు జిల్లాలో హత్యకు గురైన మాచర్ల టీడీపీ గ్రామ అధ్యక్షుడు చంద్రయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. చంద్రయ్య మృతదేహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. చంద్రయ్య అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొన్నారు.  పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు చంద్రబాబు స్వయంగా పాడె మోసిన తీరు పార్టీ కార్యకర్తలను కదిలించింది. ఆ తర్వాత ప్రసంగించిన చంద్రబాబు చంద్రయ్య పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారని కొనియాడారు. అలాంటి చంద్రయ్యను చంపడం దారుణమన్న చంద్రబాబు.. రాయలసీమలో తాను ముఠా కక్షలు అణిచివేశానని గుర్తు చేసుకున్నారు.


సీఎం జగన్.. పల్నాడులో మళ్లీ అలాంటి ముఠా కక్షలు తీసుకువస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హెచ్చరించిన చంద్రబాబు.. ఖబడ్ధార్ అంటూ సవాల్ చేశారు. మాచర్ల, పల్నాడు నీ జాగీరు కాదని హెచ్చరించారు. ఇప్పటికే.. ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదని.. ఇదేమని అడిగితే ప్రశాంతత కోసమని పిన్నెల్లి మాట్లాడారని.. గుర్తు చేశారు. ఎవరైనా ప్రజాస్వామ్యంగా నడుచుకుంటే మంచిదన్న చంద్రబాబు.. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి చంద్రయ్య అని గుర్తు చేసుకున్నారు.


ఈ ఉదయం గుంటూరు జిల్లాలో జరిగిన ఈ రాజకీయ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుంటూరు జిల్లాలో మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్య ను దారుణంగా చంపేశారు. టీడీపీ నాయకుడు చంద్రయ్యను కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనతో రోజంతా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.


తన తండ్రి హత్య కోసం ఎమ్మెల్యే పిన్నెల్లి మనుషులు నిన్నంతా గ్రామంలో మంతనాలు జరిపారని.. రాత్రంతా స్కెచ్‌ వేసుకుని ఉదయాన్ని హత్య చేశారని చంద్రయ్య కుమారుడు ఆరోపించారు. చంద్రయ్య హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ అతని కుటుంబ సభ్యులు ఉదయం కొద్దిసేపు ఆందోళన చేశారు. చంద్రయ్య మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు చేస్తున్న యత్నాన్ని అడ్డుకున్నారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: