కేసీయార్ మాటలు, వైఖరి ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదో జరిగిపోతోందనే భ్రమల్లో జనాలను ముంచేయటం తర్వాత తుస్సుమనిపించటం కేసీయార్ కు బాగా అలవాటే. ఆమధ్య ఇక ఢిల్లీపైన యుద్ధమే అంటు హోరెత్తించేశారు. కేసీయార్ ఢిల్లీకి వెళుతుంటే అక్కడ ఏదో జరగబోతోందని జనాలంతా ఆసక్తిగాను, టెన్షన్ గాను చూశారు. తీరాచూస్తే ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడిని కలిసి నమస్కారం పెట్టుకుని చక్కా వెనక్కు వచ్చేశారు.
ఢిల్లీ అంటివి..యుద్ధమంటివి అని అడిగితే అంతా మీరే రాసుకున్నారంటు మీడియాపైన అంతెత్తున ఎగిరారు. కొద్ది రోజులుగా ఢిల్లీ కోటను బద్దలు కొడతానంటు నానా గోల చేస్తున్నారు. ఏదో ప్రాస బాగుందని అంటున్నారో ఏమో జనాలకు ఏమీ అర్ధం కావటంలేదు. లేకపోతే టీఆర్ఎస్ కున్న 9 ఎంపీ సీట్లతోనే ఢిల్లీ కోటను బద్దలు కొట్టేస్తారా ? రేపటి ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో తెలీదు. మొన్నటి ఎన్నికల్లో కూడా మొత్తం 17 సీట్లూ టీఆర్ఎస్ వే అంటు ఊదరగొట్టారు.
చివరికేమైంది ? నానా అవస్తలు పడితే తొమ్మిది సీట్లు వచ్చాయి. అప్పటికి ఇప్పటికి కేసీయార్ పాలనపైన జనాల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో ఇపుడున్న సీట్లు మళ్ళీ గెలుచుకుంటే అదే బ్రహ్మాండమని అనిపిస్తోంది. మరాలంటపుడు ఇపుడున్న తొమ్మిది ఎంపీ సీట్లతోనే ఢిల్లీ కోటను బద్దలు కొట్టేస్తానంటే ఎవరైనా నమ్ముతారా ? అందుకనే కేసీయార్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిట్టల దొరని తుపాకీ రాముడని అంటున్నది.
టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఎంపీ సీట్లున్నా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కూడా కేసీయార్ లాగ మాట్లాడటంలేదు. కాబట్టి ఢిల్లీ కోటను బద్దలు కొట్టే విషయాన్ని పక్కన పెట్టేసి కేసీయార్ కాస్త సంయమనం పాటించాలి. తనతో కలిసొచ్చే వాళ్ళతోనో లేకపోతే మోడికి వ్యతిరేకంగా జట్టు కట్టాలని కోరుకుంటున్న వాళ్ళతోనో కేసీయార్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో కానీ మీడియా సమావేశాలు పెట్టి అది బద్దలు కొడతాను, ఇది బద్దలు కొడతానంటే ఏమీ జరిగేపనికాదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి