తెలుగుదేశంపార్టీలో కొందరు నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వీళ్ళే పార్టీపరువును బజారున పడేస్తున్నారనే విషయం అర్ధమైపోతుంది. అసలు వీళ్ళు మాట్లాడే మాటలకు ఎలాంటి పొంతన ఉండటంలేదు. తాజాగా సీనియర్ నేత, మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడిన మాటలు ఇలాంటివే. మీడియాతో బుద్ధా మాట్లాడుతు చంద్రబాబునాయుడుపై చెత్తవాగుడు వాగితే చంపటానికైనా, చావటానికైనా సిద్ధమన్నారు.





అసలు చంద్రబాబుపై ఎవరు ఏమీ మాట్లాడలేదు. అయినా బుద్ధా నోటికొచ్చినట్లు మాట్లాడటంలో ఏమన్నా అర్ధముందా ? పైగా చంపటానికి 100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీగా ఉన్నట్లు చెప్పటం సంచలనంగా మారింది. అసలు సూసైడ్ బ్యాచ్ ఏమిటి ? చంపటానికి 100 మంది రెడీగా ఉండటం ఏమిటి ? ఎవరిని చంపటానికి 100 మందితో సూసైడ్ బ్యాచన్ రెడీ చేశారు ? అసలా బ్యాచ్ ను రెడీచేసిందెవరు ? మళ్ళీ ఈ ప్రశ్నలకు బుద్ధా సమాధానం చెప్పలేదు.





చంద్రబాబును తిడితే, టీడీపీ ఆఫీసుపై దాడులు చేస్తే పదవులు వస్తాయని వైసీపీ నేతలు అనుకుంటున్నారట. వైసీపీలో పదవుల గోల బుద్ధాకు ఎందుకసలు ? పదవులు కావాలని కోరుకునే వైసీపీ నేతలు వాళ్ళ పాట్లేదో వాళ్ళు పడతారు ? మధ్యలో వైసీపీ నేతల గోల బుద్ధాకు ఎందుకు ? లేకపోతే చంద్రబాబును తిట్టమని, పార్టీ ఆఫీసులపై దాడులు చేయమని బుద్ధానే వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





చంద్రబాబు ఇంటిమీద దాడిచేయటానికి వెళ్ళినందుకే జోగిరమేష్ ను సీనియర్లను కాదని జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోకి తీసుకున్నారట. రమేష్ ను జగన్ మంత్రివర్గంలోకి తీసుకొవటంలో  బుద్ధా ఆసక్తి ఏమిటసలు ? ఇదంతా చూస్తుంటే వైసీపీ వాళ్ళను కెలికి నాలుగు తిట్టి, వాళ్ళతో పది తిట్టించుకోవాలన్న దుగ్ద తప్ప బుద్ధా వెంకన్న మాటల్లో మరోటి కనబడటంలేదు. చివరకు తమ అధినేత చంద్రబాబును పుట్టినరోజున కూడా బుద్ధా లాంటివాళ్ళు ప్రశాంతంగా ఉండనిచ్చేట్లు లేరు చూస్తుంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: