వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశంపార్టీకి జనసేన గండం తప్పేట్లు లేదు. పోయిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ ఓటమిపై  తీరిగ్గా సమీక్ష చేసుకున్నది. ఆ సమీక్షలో సుమారు 70 సీట్లలో జనసేన వల్లే టీడీపీ ఓడిపోయినట్లు అంచనాకు వచ్చారు. ఎందుకంటే టీడీపీ లెక్కేసిన సీట్లలో గెలిచిన  వైసీపీ అభ్యర్ధులకు వచ్చిన మెజారిటికన్నా జనసేన అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు ఎక్కువ.

ఈ నియోజకవర్గాల్లో రెండోస్ధానంలో టీడీపీయే నిలిచినా మూడోస్ధానంలో నిలిచిన జనసేన వల్లే తమపై దెబ్బపడిందని తమ్ముళ్ళు  నిర్ధారణకొచ్చారు. సరే ఇదంతా చరిత్రగా నిలిచిపోయిందని అనుకుంటే మరి భవిష్యత్తు మాటేమిటి ? వచ్చే ఎన్నికల్లో ఈ 70 నియోజకవర్గాల్లో ఎలా గెలవాలన్న విషయంలోనే  టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో అయినా, వచ్చే ఎన్నికల్లో అయినా తమకు  జనసేన గండం పొంచుందనే విషయమే తమ్ముళ్ళని కలవర పెట్టేస్తున్నది.

అందుకనే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని కొందరు తమ్ముళ్ళు అనుకుంటుంటే మరికొందరేమో పొత్తు వల్ల నష్టపోతామని వాదిస్తున్నారు. అంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఒకరకమైన నష్టం, పొత్తు పెట్టుకోకపోతే మరోరకమైన నష్టం తప్పదన్నమాట. టీడీపీ+జనసేన పొత్తు పెట్టుకోవటం ఇష్టంలేని కాపుల్లో మెజారిటి వైసీపీకి ఓట్లేసే అవకాశముంది. ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలో టీడీపీ-జనసేన కలవటం చాలా సామాజికవర్గాలకు ఏమాత్రం ఇష్టంలేదు.


అందుకనే పవన్ కల్యాణ్ తో భేటీ అయిన ఉత్తరాంధ్ర కాపునేతల్లో చాలామంది టీడీపీతో పొత్తు వద్దంటే వద్దని వాదిస్తున్నారు. జనసేన వల్ల టీడీపీకి జరగబోయే నష్టం కూడా ఎక్కువగా ఉత్తరాంధ్ర+రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో దెబ్బపడింది పై ప్రాంతాల్లోనే కాబట్టి. పోయిన ఎన్నికలతో పోల్చుకుంటే ఇపుడు జనసేన బాగా బలపడిందని ఆపార్టీ నేతలు అనుకుంటున్నారు. మరీ పరిస్ధితిల్లో టీడీపీ, జనసేన విడిగా పోటీచేస్తే టీడీపీకి జరిగేనష్టం మరింత ఎక్కువగా కూడా ఉండచ్చని అనుకుంటున్నారు. సో జనసేన నేతల అంచనాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి జనసేన గండం మరోమారు తప్పేట్లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: