
పలు నియోజకవర్గాలు షిఫ్ట్! .. ఈ పరిణామంతో పలు నియోజకవర్గాలు కొత్త జిల్లాల్లోకి వెళ్లనున్నాయి. ఉదాహరణకు – టెక్కలి నియోజకవర్గం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నా.. ఇప్పుడు ‘పలాస’ జిల్లాలోకి వెళ్తుంది. ఇలాగే పిఠాపురం, తుని వంటి నియోజకవర్గాలు అనకాపల్లి జిల్లాలోకి మళ్లనున్నాయి. అలాగే ‘విజయవాడ’, ‘అమరావతి’, ‘గూడూరు’, ‘బాపట్ల’, ‘మదనపల్లె’, ‘హిందూపురం’ వంటి ప్రాంతాలు ఇప్పుడు స్వతంత్ర జిల్లాలుగా మారుతుండటంతో అక్కడి రాజకీయం మళ్లీ వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ లెక్కలు ! .. జిల్లా కేంద్రాలు మారడమే కాదు – వాటిలో వచ్చే నియోజకవర్గాల సమీకరణ కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలకు భయంకరమైన లెక్కలు వేయిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త సామాజిక సమీకరణలు ఏర్పడడం వల్ల దాని ప్రభావం పార్టీ టికెట్ల కేటాయింపుపై పడే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గం ఏ జిల్లాలోకి వెళ్తుందన్న దానిపై ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
పాలనకు సౌలభ్యం.. కానీ ప్రజలు? .. ఇలాంటి మార్పులతో పాలన సులభతరమవుతుందనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నా.. దీనివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం కంటే అసౌకర్యాలే ఎక్కువగా ఉంటాయన్న వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. కొత్త జిల్లాలకు పరిపాలన, సిబ్బంది, మౌలిక వసతులు, అధికారుల సమీకరణపై ఇంకా క్లారిటీ లేదు. ఇది తాత్కాలిక గందరగోళానికి దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి! .. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కానీ ఫైళ్లన్నీ సీఎం చంద్రబాబు ఆమోదానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. త్వరలో గెజిట్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తం మీద... జిల్లాల రీ ఆర్గనైజేషన్‌లో ఈ మార్పులు ఎటు మలుపుతీస్తాయో చూడాలి. పాలనా పరంగా ఇది పెద్ద అడుగే అయినా, దాని రాజకీయ ప్రయోగాలు మాత్రం ఉత్కంఠను పెంచుతున్నాయి!