అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు కశ్మీర్ అంటూ కలుగజేసుకున్న ఆయన, ఇప్పుడు ఏకంగా వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఆగస్టు 1వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటిస్తూ, భారత్‌కు తీవ్రమైన హెచ్చరికలు పంపారు. ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని తేల్చిచెప్పారు.

భారతదేశం అమెరికా వస్తువులపై ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధిస్తోందని ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఉత్పత్తులపై ఈ పన్నులు 60% నుంచి 75% వరకు ఉన్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన మండిపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో పాపులరైన టెస్లా కార్లు, హార్లీ డేవిడ్‌సన్ బైక్‌లపై భారత్ మోపుతున్న అధిక సుంకాలపై ఆయన చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. ఈ వాణిజ్య అసమతుల్యతను సరిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ తన చర్యలను సమర్థించుకుంటున్నారు.

వాణిజ్య ఒప్పందాలపై చర్చలు పూర్తి చేయడానికి ఆగస్టు 1వ తేదీని ట్రంప్ చివరి అవకాశంగా ప్రకటించారు. ఈ లోగా భారత్ దిగిరాకపోతే, ఇక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 15% నుంచి 25% వరకు సుంకాలు విధిస్తామని ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఇది కేవలం హెచ్చరిక కాదని, కఠిన నిర్ణయమేనని సంకేతాలు పంపారు. ఈ చర్య ద్వారా, చర్చల విషయంలో భారత్ మెడలు వంచి, తమకు అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకోవాలనేది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది.

తగ్గేదేలే అంటున్న భారత్..

అయితే, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని మోదీ సర్కార్ స్పష్టమైన సంకేతాలు పంపుతోంది. ఎవరి బెదిరింపులకూ భయపడబోమని, దేశ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెబుతోంది. అమెరికా ప్రతిపాదిస్తున్న ఒప్పందంలో కొన్ని అంశాలపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను భారత మార్కెట్లోకి భారీగా దిగుమతి చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోంది. దీనికి అంగీకరిస్తే, దేశీయ రైతులు, పాడి పరిశ్రమ తీవ్రంగా నష్టపోతాయని భారత్ ఆందోళన చెందుతోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టం చేయడంతో, చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

ఈ నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ వాణిజ్య వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఆగస్టు 1వ తేదీ సమీపిస్తున్న కొద్దీ, ఈ ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: