
పార్టీ వర్గాల ప్రకారం, బీటెక్ రవి తాజా విజయం వెనుక మూడు ప్రధాన వ్యూహాలు ఉన్నాయి. కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబానికి కంచు కోట. ముఖ్యంగా పులివెందుల ప్రాంతం విషయానికి వస్తే, అక్కడ టీడీపీకి విజయం సాధించడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో రవి, వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి, అందరినీ కలుపుకొని, స్థానిక నాయకులకు సరైన దిశానిర్దేశం ఇచ్చారు. ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు రాకుండా, సమష్టి కృషితో విజయం సాధించారు. రవి వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉన్నా ఎప్పుడూ పార్టీ నిర్ణయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల వ్యూహాల నుంచి ప్రజలతో మాట్లాడే విధానం వరకు, పార్టీ లైన్ ప్రకారం వ్యవహరించారు. అదే సమయంలో ప్రజలకు పార్టీ విధానాలను సులభంగా, స్పష్టంగా వివరించగలిగారు.
ఎన్నికల సమయాల్లోనే కాదు, ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండడం రవి ప్రత్యేకత. గ్రామాల వారీగా పర్యటిస్తూ సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, ఇప్పుడు జడ్పీ ఎన్నికల్లోనూ ఈ అలవాటు ఆయనకు గెలుపు తీసుకువచ్చింది.