
- వైద్య విద్య, ప్రజారోగ్యాన్ని ప్రైవేటు పరం చేయడంలో కూటమి కుట్ర
- వైద్య విద్య కోసం జగన్ చేసిందేమీ లేదు
- నిధులు ఇవ్వకుండా సొంత డబ్బా కొట్టుకున్నారు
- బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కూటమి తీసుకున్న నిర్ణయంపై బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ భగ్గుమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, కానీ నిధులు ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. రాష్ట్రంలో తామే వైద్య విద్యను ప్రోత్సహిస్తున్నామని వైసిపి సొంత డబ్బా కొట్టుకుందే తప్ప నిధులను మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు చిత్తశుద్ది ఉండి ఉంటే అధికారంలో ఉన్నప్పుడే నిధులను మంజూరు చేసి మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి రాకముందు 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా ఆయన అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకున్నారని, వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అవి పూర్తి కాలేదన్నారు.
చివరకు జగన్ హయాంలో ఆరోగ్య శ్రీ బిల్లులు కూడా పెండింగ్ లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడంతో పాటు ప్రజారోగ్యాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ హయాంలో నిర్మించతలపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. వైద్య విద్యను ప్రైవేటు పరం చేస్తే ఫీజులు గణనీయంగా పెరుగుతుయాన్నారు. ప్రైవేటు సంస్థలు లాభాపేక్షతో పనిచేస్తాయన్నారు. దీని వల్ల నిరుపేద విద్యార్ధులకు అవకాశాలు తగ్గుతాయని హెచ్చరించారు.
ఇప్పటికే రాష్ట్రం నుంచి చాలా మండి నిరుపేద విద్యార్ధులు నీట్ లో సీట్లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకప్పుడు 2,360 సీట్లు ఉంటే ఈ కొత్త కాలేజీల వల్ల ఆ సంఖ్య 4910 కి పెరుగుతుందని దానివల్ల మరో 2500 విద్యార్ధులకు మేలు జరుగుతుందున్నారు. అయితే మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడం వల్ల చాలా మంది విద్యార్ధులకు నష్టం జరుగుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు కూడా వైద్యవిద్య, ప్రజారోగ్యంతో రాజకీయాలు చేశాయని ఆయన విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ఆయన హెచ్చరించారు.