
జగన్ లెక్కల ప్రకారం వలంటీర్ల వ్యవస్థ తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తామని ధీమాతో ఉన్నా సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నికల సమయంలో చాలా మంది వలంటీర్లు యూటర్న్ తీసుకున్నారని, ప్రజల అసహనం కూడా పెరిగిందని చెబుతున్నారు. చివరకు వైసీపీ ఓటమి పాలైంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదట వలంటీర్లకు హామీలు ఇచ్చినా, వాస్తవానికి ఈ వ్యవస్థను కొనసాగించలేదు. దీంతో వలంటీర్లు నిరసనలు చేపట్టారు, ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలానికి సైలెంట్ అయిపోయినా, తమను కూటమి సర్కారు అన్యాయం చేసిందని వాపోయారు.
ఈ టైంలో తాజాగా సీఎం చంద్రబాబు ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులే వలంటీర్ల వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, వలంటీర్లు లేకపోతే పథకాలు చేరవని తప్పుడు ప్రచారం చేశారని ఆయన స్పష్టం చేశారు. “మేం ఇప్పుడు వలంటీర్లు లేకుండానే పింఛన్లు, పథకాలను అందిస్తున్నాం. అందుకే ఆ వ్యవస్థను పక్కన పెట్టాం” అని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు వలంటీర్లలో ఒక కొత్త అవగాహన తీసుకొచ్చాయి.
అసలు విషయాన్ని గ్రహించిన వలంటీర్లు, తమ తొలగింపుకి కారణం కూటమి ప్రభుత్వం కాదని.. వైసీపీ రాంగ్ డైరెక్షన్... మభ్యపెట్టడమే కారణమన్న అసంతృప్తి వారిలో ఎక్కువుగా కనిపిస్తోంది. వీరంతా మళ్లీ జగన్‌కు మద్దతుగా నిలుస్తారని వైసీపీ లెక్కలు వేసుకున్నా, పరిస్థితి పూర్తిగా తారుమారైంది. వలంటీర్ల అసహనం వైసీపీకి మరో పెద్ద మైనస్‌గా మారింది. ప్రజల్లో అసంతృప్తిని తగ్గించాల్సిన అవసరం ఉన్న వలంటీర్లే ఇప్పుడు జగన్ తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.