ఆంధ్రప్రదేశ్‌లో పాలక కూటమి నేతల మధ్యే అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు డీజీపీ నివేదిక కోరడం కలకలం రేపింది. అయితే, ఈ అంశంలో డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డీఎస్పీకి 'క్లీన్ చిట్' ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్ ఆగ్రహం: 'అధికార దుర్వినియోగం'పై ఫిర్యాదు! .. జనసేన పార్టీ నిన్న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్ కల్యాణ్‌కు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయన పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోవడం, సివిల్ వివాదాలలో జోక్యం చేసుకోవడం, పక్షపాత ధోరణి చూపించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, డీఎస్పీ కూటమి నేతల పేర్లను చెప్పుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే తీవ్ర ఫిర్యాదులు పవన్‌ దృష్టికి వచ్చాయి.

దీంతో, పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. డీఎస్పీ వ్యవహార శైలిపై తక్షణమే నివేదిక పంపించాలని ఆదేశించారు. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని, పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకూడదని పవన్ స్పష్టం చేశారు. అంతేకాక, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీష్ గుప్తాను సైతం పవన్ కోరారు. డీఎస్పీకి రఘురామ 'క్లీన్ చిట్': కారణమేమిటి? .. పవన్ కల్యాణ్ చర్యతో డీఎస్పీ జయసూర్య వ్యవహారం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో, పొరుగు నియోజకవర్గం ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇవాళ స్పందించారు. తనకు అందిన సమాచారం ప్రకారం డీఎస్పీకి మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉందని రఘురామ పేర్కొన్నారు.

జిల్లాలో పేకాటపై ఆయన గట్టి నిఘా పెట్టారని, అందుకే ఆయనపై ఇలాంటి అభియోగాలు వస్తున్నాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఉండిలో ఎలాంటి పేకాట స్థావరాలు లేవని, జూదంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన స్పష్టం చేశారు. తద్వారా పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసిన డీఎస్పీకి రఘురామకృష్ణంరాజు పరోక్షంగా క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఒకవైపు కూటమిలో అత్యంత కీలక నేత డీఎస్పీపై కఠిన చర్యలకు సిఫార్సు చేయగా, మరోవైపు అదే కూటమికి చెందిన డిప్యూటీ స్పీకర్ ఆ అధికారిని సమర్థించడం పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చకు దారితీసింది. పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలపై డీజీపీ నివేదిక ఎలా ఉండబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: