
సునీత పిటిషన్‌లో చేసిన ప్రధాన ప్రస్తావన – మాజీ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం ఇచ్చిన స్టేట్‌మెంట్ గురించినది. ఆయన గతంలో సీబీఐ ఎదుట ఇచ్చిన సాక్ష్యంలో జగన్ నివాసంలో జరిగిన సమావేశాలను ప్రస్తావించారని పేర్కొన్నారు. అదే రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జగన్ నివాసంలో తాను సమావేశమయ్యానని, కాసేపటి తర్వాత జగన్ “చిన్నాన్న ఇక లేరు” అని చెప్పినట్లు అజేయ కల్లం సీబీఐకి వెల్లడించారని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ స్టేట్‌మెంట్‌తో వివేకా మరణం జరిగిన సమయం, సమాచారం ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. ముఖ్యంగా వైఎస్ భారతి పేరు ఈ సందర్భంలో పరోక్షంగా ప్రస్తావనకు రావడంతో కేసు మరింత సెన్సేషన్‌గా మారింది.
ఇక మరో కీలక అంశం – ఐదో నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, కడప జైలులో ఉన్న అప్రూవర్ దస్తగిరిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ఇప్పుడు సీబీఐ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. సునీతారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు ఎలా స్పందిస్తుందో, తదుపరి విచారణ ఏ దిశగా సాగుతుందో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు కుటుంబ అంతర్గత వివాదంగా కనిపించిన ఈ హత్యకేసు ఇప్పుడు మళ్లీ రాజకీయ రంగు పులుముకుంటోంది.