- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైకమాండ్‌తో జరిగిన సమావేశంలో తన అసంతృప్తిని బహిర్గతం చేసినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, పాలనలో తనకు సరైన స్వేచ్ఛ ఇవ్వకపోవడం, వివిధ వర్గాల ద్వారా హైకమాండ్ తరచూ జోక్యం చేసుకోవడం వల్ల తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను రేవంత్ స్పష్టంగా వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడంలో తాను ఎదుర్కొంటున్న అవరోధాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట.


ఇటీవల ఒక కేబినెట్ మంత్రి కుమార్తె చేసిన ఘోర ఆరోపణలు, ఆ ఘటనను హైకమాండ్ లైట్‌గా తీసుకోవడం కూడా రేవంత్‌ను తీవ్రంగా కలిచివేసిందని చెబుతున్నారు. “ఒక ముఖ్యమంత్రిపై ఇలాంటి ఆరోపణలు వస్తే, ఆ వ్యక్తిపై త‌క్ష‌ణ‌ చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజల్లో సీఎం అధికార బలం తగ్గినట్లు భావిస్తారు” అని ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అదే సమయంలో, కేబినెట్ నియంత్రణ తన చేతిలో లేకపోతే, పాలన ఎలా సక్రమంగా సాగుతుందన్న అంశంపై రేవంత్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది మంత్రులు హైకమాండ్ మద్దతుతో తాను చెప్పిన దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నార... దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాల్లో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయని కూడా రేవంత్ అధిష్టానానికి చెప్పిన‌ట్టు స‌మాచారం.


ఇక తనపై వచ్చే చిన్న చిన్న ఫిర్యాదులకే హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడం, తనను బలహీనపరచే ప్రయత్నాలు జరగడం పట్ల కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే, రేవంత్ నేరుగా వాదనలకు దిగకుండా, పార్టీ పరిస్థితి దిగజారడానికి కారణమైన అంశాలను సున్నితంగా వివరించినట్లు చెబుతున్నారు. హైకమాండ్ వద్ద కొంతమంది నేతలకు ఉన్న మద్దతు కారణంగా వారు క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తం మీద, రేవంత్ - హైకమాండ్ మధ్య అనుకున్నంత స‌ఖ్య‌త లేద‌ని... రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ లేద‌న్న‌దే వినిపిస్తోన్న స‌మాచారం. ఈ టైంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ ప్ర‌తిష్ట‌కు స‌వాల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: