ఈ ప్రచార వ్యూహంలో భాగంగా, వరుసగా నాలుగు రోజుల పాటు ఒక్క ఉదుటన నాయకులందరినీ రంగంలోకి దింపనున్నారు. అంటే.. ఈ నాలుగు రోజులు నియోజకవర్గం వాడవాడలా.. వీధివీధినా.. బీజేపీ నాయకులే కనిపించేలా ప్రచారం చేయనున్నారు. అగ్ర నాయకులు: భారీ సభలు, ముఖ్య ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. ద్వితీయ శ్రేణి నాయకులు: ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తారు. కార్యకర్తలు: ప్రచార పత్రాలను పంచుతూ, కూడళ్లలో కీలక అంశాలపై చర్చలు పెడతారు. ఈ ప్రక్రియలన్నీ ఒకే సమయంలో, ఉధృతంగా జరగడం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తుందని, ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని కమల నాథులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రుల రాక: కాషాయమయం చేయడమే లక్ష్యం .. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ అగ్రనాయకత్వం దృష్టి సారించినప్పటికీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, రాజస్థాన్ సహా ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఒకరిద్దరు ముఖ్యమంత్రులు ప్రచారం కోసం హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం.
అలాగే, ఆయా రాష్ట్రాల్లోని పలువురు కీలక నాయకులు కూడా తరలివచ్చి ప్రచారంలో పాల్గొననున్నారు. వీరంతా ఒకేసారి రంగంలోకి దిగి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని 'కాషాయమయం' చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ నాలుగు రోజుల దూకుడు ప్రచారం ద్వారా.. వెనుకబడ్డామన్న అపప్రదను తుడుచుకుని, ప్రధాన పోటీలోకి దూసుకురావాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ప్రజల నాడి: ఎవరికి లాభం? .. ఒకేసారి భారీగా ప్రచారం చేసినా, దఫా దఫాలుగా చేసినా.. ప్రజల నాడి ఏమిటన్నదే ముఖ్యం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఓటరు నాడి బీఆర్‌ఎస్ - కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోందనే సంకేతాలను ఇస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ దూకుడు పెంచడం వల్ల ఈ పోరు కాస్త తగ్గుతుందే తప్ప, ఏకపక్షంగా మార్పు రావడం కష్టమన్న అభిప్రాయం ఉంది. అయితే, కీలకనాయకుల రాక బీజేపీ ప్రాభవాన్ని పెంచుతుందని, పార్టీకి ఇది అడ్వాంటేజ్ అవుతుందని మరికొందరు అంటున్నారు. ఈ మెరుపుదాడి ఫలితం ఎన్నికల రోజున ఎలా ఉంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి