ఆంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దద్దరిల్లించిన పేరు విజయసాయిరెడ్డి. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, వైసీపీ రాజకీయ వ్యూహాల వెనుక ఉన్న ‘బ్రెయిన్’గా పేరుగాంచిన ఈ నేత ఇప్పుడు పూర్తిగా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు. పబ్లిక్‌గా కనిపించడం లేదు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా కూడా పెద్దగా స్పందించడం లేదు. ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వాన్ని పొగడుతూ చేసే ట్వీట్లు మినహా, ఆయన నుంచి ఎటువంటి రాజకీయ సంకేతాలు రావడం లేదు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో ఆయనను విచారించేందుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మొదట “వస్తాను” అని చెప్పినా, తర్వాత మౌనమునిగారు. “నాకు కుదిరినప్పుడు వస్తాను” అని సమాధానం ఇచ్చి, అప్పటి నుంచి కనిపించలేదు.
 

నెలలు గడిచినా ఆయన విచారణకు హాజరుకాలేదు. చివరికి సిట్‌ కూడా ఆయనపై దృష్టి మానేసింది. దీంతో రాజకీయ వర్గాల్లో “విజయసాయిరెడ్డి ఎక్కడ?” అన్న ప్రశ్న మళ్లీ మోగుతోంది. ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో బుల్లెట్ స్పీడ్‌లో దూసుకెళ్లేవారు. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు, ఆర్కే- ఎవరినీ వదిలేవారు కాదు. ఆయన ట్వీట్లు దూషణలతో నిండిపోయేవి. జగన్ రెడ్డిని మెప్పించడమే లక్ష్యంగా, ఎవరినైనా తిట్టడంలో ఆయనకు ఎలాంటి ఆప్త భావన ఉండేది కాదు. కానీ ఆ ఉత్సాహం ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. జగన్‌ సర్కార్‌ గడచిన తర్వాత ఆయన మాటల్లోనూ, బయటకీ కనిపించడంలేదు. రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే – జగన్‌ భయమే ఆయనను ఆజ్ఞాతంలోకి నెట్టిందని అంటున్నారు.

 

లిక్కర్ స్కామ్, ఫండ్స్, కంపెనీల లావాదేవీలపై ఆయనకున్న సమాచారం చాలా కీలకమని చెబుతున్నారు. ఆయన టీడీపీ శిబిరానికి ఆ సమాచారాన్ని అందించారని, అందుకే జగన్ వైపు నుంచి అప్రమత్తత పెరిగిందని ప్రచారం ఉంది. అందుకే తన భద్రత కోసం ఆయన ఎక్కడ ఉన్నారో గుట్టుగా ఉంచుతున్నారని అంటున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఆయనపై చర్యలు తీసుకోవడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. విశాఖలో ఆయనచేసిన బీచ్‌ కబ్జా కేసులు, రాజకీయ వేధింపుల ఆరోపణలు - అన్నీ అలానే ఉన్నాయి! కానీ ప్రభుత్వం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కోర్టు జరిమానాలు వేసినా, ఆయనను అరెస్ట్ చేయలేదు. జగన్‌కు సంబంధించిన ఇన్‌సైడ్‌ సమాచారాన్ని పంచుకుంటున్నారని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజకీయంగా దూరంగా ఉన్నా, ఆయన పేరు మాత్రం రాజకీయ చర్చల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మౌనం వెనుక ఏముంది? భయం, వ్యూహం, లేదా కొత్త రాజకీయ ఒప్పందమా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: