ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త జిల్లాల అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. వైసీపీ హయాంలో 2022లో రాష్ట్రాన్ని 13 కొత్త జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ విభజనను ఎంపీ సీట్ల ఆధారంగా చేసి, భౌగోళిక, ఆర్థిక, సాంస్కృతిక సమీకరణలను పరిగణనలోకి తీసుకోలేదని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అప్పట్లో కూటమి నేతలు ప్రజా ఆకాంక్షలను గౌరవిస్తూ, అవసరమైతే పునర్విభజన చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పడి జిల్లాల పునర్విభజనపై సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు, అభ్యర్థనలు, సెంటిమెంట్లు అన్నీ పరిశీలించి తుది నివేదిక తయారవుతోందని సమాచారం.
 

ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొత్త జిల్లాల చర్చ మళ్లీ ఊపందుకుంది. వాటిలో ప్రముఖంగా శ్రీకాకుళం జిల్లా విభజన అంశం హాట్‌టాపిక్‌గా మారింది. పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పలాస జిల్లా ప్రతిపాదనతో ఊపిరి బిగపట్టిన శ్రీకాకుళం .. పలాస, టెక్కలి, ఇచ్చాపురం, పాతపట్నం నియోజకవర్గాలతో కలిపి “పలాస జిల్లా”గా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మూలపేట పోర్టు, ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్టు, కొబ్బరి, జీడి పరిశ్రమలు ఉండటంతో అభివృద్ధి కేంద్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో కొత్త జిల్లా ఏర్పాటుకు మరింత బలం చేకూరిందని అంటున్నారు. అయితే, మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

 

ఇప్పటికే 2022లో జరిగిన విభజనలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కుదించబడ్డ శ్రీకాకుళం ఇప్పుడు మరింత చిన్నదవుతుందనే ఆందోళన ఉంది. “మరిన్ని అసెంబ్లీలు వేరు చేస్తే, జిల్లా ప్రగతి ఆగిపోతుంది” అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజాం, పాలకొండ వంటి నియోజకవర్గాలను తిరిగి శ్రీకాకుళంలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సెంటిమెంట్ – రాజకీయ లెక్కలు .. పలాస జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి అవకాశాలు పెరిగినా, శ్రీకాకుళం చరిత్రాత్మక ప్రాధాన్యం తగ్గిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కిన్జరాపు కుటుంబం ప్రభావం ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్‌స్పాట్‌గా మారింది. కూటమి ప్రభుత్వం చివరికి ప్రజా సెంటిమెంట్‌కు వంగుతుందా? లేక అభివృద్ధి లెక్కలకే ప్రాధాన్యత ఇస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: