భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపకుడు బోడే రామచంద్రయాదవ్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తన పార్టీ బీసీవైని మరింత బలోపేతం చేయాలనే ధృడ నిశ్చయంతో ముందుకు సాగుతున్న ఆయన, త్వరలోనే పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవడమే కాకుండా, పార్టీకి పునరుత్తేజం ఇవ్వాలని రామచంద్రయాదవ్ వ్యూహరచన చేస్తున్నారని బీసీవై వర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో కూడా రామచంద్రయాదవ్ తన నియోజకవర్గం పుంగనూరులో పాదయాత్ర నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ యాత్ర ఆయనకు రాజకీయంగా పెద్ద విజయాన్ని ఇవ్వకపోయినా, ప్రజల్లో ఆయనకు సానుభూతి, గుర్తింపు తెచ్చింది. "ప్రజల మద్య ఉండే నాయకుడు" అనే పేరును ఆయన సంపాదించారు.
 

ముఖ్యంగా రైతుల సమస్యలు, నిరుద్యోగం, విద్యుత్ సంక్షోభం, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలపై బోడే స్పష్టమైన అభిప్రాయాలతో మాట్లాడుతుండటంతో ఆయనకు యువతలో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు బోడే రామచంద్రయాదవ్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఉమ్మడి రాయలసీమ ప్రాంతంతోపాటు కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు తపనపడుతున్నారు. ముందుగా బస్సు యాత్ర ఆలోచనలో ఉన్నా, పాదయాత్రతో ప్రజలకు మరింత చేరువ కావచ్చని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే, జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేష్ వంటి నాయకులు పాదయాత్రలతో ప్రజాదరణ పొందినట్లు బోడే కూడా నమ్ముతున్నారు. కార్తీక మాసం అనంతరం పాదయాత్రకు శుభారంభం ఇవ్వాలనే ప్రణాళిక సిద్ధమవుతోంది.

 

రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి ముఖ్య పట్టణం, గ్రామం దాకా చేరుకునేలా మార్గరేఖలు సిద్ధం చేస్తున్నారు. యాత్రలో ప్రజల సమస్యలను విని, ప్రత్యక్షంగా స్పందించాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశం. రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారుల సమస్యలపై బీసీవై నేతగా బోడే బలమైన స్వరం వినిపించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వస్తున్నారు. ఈ యాత్ర ద్వారా బోడే రామచంద్రయాదవ్ ప్రజల్లో మరింత స్థిరమైన ఇమేజ్ సాధిస్తే, రానున్న ఎన్నికల్లో బీసీవై పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశముంది. పార్టీ అంతర్గత వర్గాలు కూడా ఈ పాదయాత్రను "బీసీవైకు బూస్టర్ షాట్"గా భావిస్తున్నాయి. త్వ‌ర‌లోనే యాత్రకు సంబంధించిన తేదీలు, మార్గపటాలు, ప్రధాన అంశాలను బోడే అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తం మీద, బోడే రామచంద్రయాదవ్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహం నింపేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: