అయితే... ఈ అభివృద్ధి దారిలో ఆయన పార్టీ కార్యకర్తలు మాత్రం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు కానీ, పార్టీ కోసం కాదేమో!” అంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం లో చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పటికీ పునరావృతం అవుతున్నాయంటూ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలు సమపాళ్లలో తిప్పకపోతే, టీడీపీ మళ్లీ ప్రజల మద్దతు కోల్పోతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
1999లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు సైబరాబాద్‌ను సృష్టించిన చంద్రబాబు, ఆ అభివృద్ధి ఫలితం 2004లో ఎందుకు రాలేదో ఇప్పుడు కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. “హైటెక్ సిటీలు కాదు, హృదయాలను గెలుచుకోవాలి” అన్న భావనను వారు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అభివృద్ధి చేసిన ప్రాంతాల ప్రజలే తరువాత ఎన్నికల్లో తిరస్కరించారంటే, కేవలం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాదు, ప్రజా అనుబంధమే ముఖ్యమని వారు చెబుతున్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కలను సాకారం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్లిన చంద్రబాబు, అనంతపురంలో కియా ఇండస్ట్రీస్ తెచ్చి మరో చరిత్ర సృష్టించారు. అయినా కూడా 2019లో ఆ ప్రాంతాల్లో పార్టీ బలహీనపడటం ఎందుకని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు “అభివృద్ధి + సంక్షేమం” అనే డబుల్ యాక్షన్ ప్లాన్‌తో పని చేస్తున్నప్పటికీ, గ్రాస్‌రూట్ స్థాయిలో పార్టీ బలోపేతం లేకుంటే ఫలితం శూన్యం అవుతుందని వారి ఆందోళన. ఇప్పటికైనా చంద్రబాబు కేవలం రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కాదు, పార్టీ కార్యకర్తల అభివృద్ధికీ దృష్టి పెట్టాలి. ఎందుకంటే, అభివృద్ధి ప్రాజెక్టులు ఓటు వేయవు – కార్యకర్తలే పార్టీ వెన్నెముక!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి