ఇక ఈ సంఘటన అనంతరం వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాశీబుగ్గకు రాక రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. గత మూడు దశాబ్దాలుగా శ్రీనివాస్ హరిశ్చంద్రపురం, టెక్కలి నియోజకవర్గాల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ, టీడీపీ నేతలు కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు లకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచారు. ఇటీవల వ్యక్తిగత జీవితం కారణంగా వివాదాల్లో చిక్కుకున్న ఆయన, భార్యతో విభేదాల తర్వాత హైదరాబాద్‌లో నివాసం ఏర్పరచుకున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు, వీడియోలతో నిరంతరం చర్చలో ఉంటూ “డిజిటల్ స్టార్”గా గుర్తింపు తెచ్చుకున్నారు. దువ్వాడ ప్రేయసి దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనడంతో, ఈ జంట ఎటు వెళ్లినా మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ నేపథ్యంలో దువ్వాడ తన ప్రేయసితో కలిసి కాశీబుగ్గకు చేరుకుని హరి ముకుంద పండాను కలవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజకీయంగా టెక్కలిలో స్థిరపడిన ఆయన, స్వగ్రామం కాశీబుగ్గలో కనిపించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. దువ్వాడకు కాశీబుగ్గతో వ్యక్తిగత అనుబంధం ఉంది. ఆయన పుట్టి పెరిగిన ఊరు అదే కాగా, తల్లి, సోదరులు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. అంతేకాదు, ఆయన తండ్రి దువ్వాడ కృష్ణమూర్తి, హరి ముకుంద పండాకు అత్యంత సన్నిహిత మిత్రులు. అదేవిధంగా హరి ముకుంద పండా కుమారుడు హెచ్. రాజకుమార్, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ స్కూల్ డేస్‌లో క్లాస్‌మేట్స్ కావడంతో కుటుంబ సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో దువ్వాడ రాక కేవలం సానుభూతి తో పండాను పరామర్శించేందుకే వెళ్లినట్టు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి