బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే దూకుడు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచి కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తూ ముందంజలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెలువడిన తాజా లెక్కల ప్రకారం, ఎన్డీయే కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 122 స్థానాలను దాటేసి, ఏకంగా 191 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇది బీహార్‌ ఎన్నికల చరిత్రలో ఎన్డీయే కోసం మరోసారి ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తోంది.ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌ మాత్రం కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో నిలబడగలిగింది. ఇతర పార్టీలు మూడుచోట్ల లీడ్‌లో ఉన్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈసారి ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 6న తొలి విడత, నవంబర్‌ 11న రెండో విడత పోలింగ్‌లు శాంతియుతంగా ముగిశాయి. భారీగా నమోదైన పోలింగ్‌ శాతం, ప్రజల్లో ఉన్న రాజకీయ ఉత్సాహం ఈ ఎన్నికల ప్రాధాన్యాన్ని మరింత పెంచాయి.


ఈ ఎన్నికల్లో జేడీయూ 101 స్థానాల్లో, బీజేపీ 101 స్థానాల్లో, లోక్ జన్‌శక్తి (రాంవిలాస్‌) 28 స్థానాల్లో పోటీ చేసింది. మెజార్టీ మార్క్‌ 122 అయినప్పటికీ, దానికంటే చాలా ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం సాధించడం ద్వారా ఎన్డీయే కూటమి బలమైన రాజకీయ పట్టు సాధించినట్లు కనిపిస్తోంది. గత 2020 ఎన్నికల్లో ఈ కూటమి 125 సీట్లను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, ఆ సంఖ్యను ఈసారి దాటేసేలా కనిపించడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని బీహార్‌పై మరింతగా మళ్లించింది.బీహార్‌ ప్రజలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే భారీ విజయాన్ని అందించబోతున్నట్లు ఈ ట్రెండ్‌ స్పష్టంగా సూచిస్తోంది. కేవలం బిహార్ మాత్రమే కాకుండా జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా ఈ ఫలితాలు ప్రభావం చూపే అవకాశముందనే అభిప్రాయం నిపుణులది.



ఇలాంటి పరిణామాల నడుమ విశాఖలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో బీజేపీ 200 స్థానాలకు పైగా గెలవబోతుందని ఆయన అంచనా వేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే చూస్తున్నారని, మోదీ ఒక్కరే దేశాన్ని నడిపించగల నాయకుడని చంద్రబాబు స్పష్టం చేశారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకత్వం లభించడం భారత రాజకీయాలకు శుభపరిణామం అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇలా చూస్తే, బీహార్‌ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా, జాతీయ రాజకీయ దిశను ప్రభావితం చేసే మలుపుగా ఎదగబోతున్నట్లు స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: