- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

చిన్న ప్రయత్నంతో పెద్ద ప్రయోజనం సాధించే అవకాశం దొరికితే అంత‌కు మించి అదృష్టం ఉండ‌దు. మ‌రీ ముఖ్యంగా రాజకీయాల్లో అయితే మరింత ప్ల‌స్ అవుతుంది. ఇప్పుడు అలాంటి అవకాశం కూటమి ప్రభుత్వానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. త్వరలోనే జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, కొత్త మండలాల సృష్టి వంటి కీలక చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాల ఏర్పాటు, మార్పు, చేర్పులు, మండలాల సరిహద్దుల పునర్నిర్మాణం వంటి అంశాలను పరిశీలిస్తోంది.


ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల పేర్లు మారనున్నాయన్న సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం పల్నాడు జిల్లాను గుర్రం జాషువా లేదా బ్రహ్మనాయుడు పేర్లలో ఏదో ఒకదానికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. స్థానిక చరిత్ర, సామాజిక భావాలు, ప్రజల అభీష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇదే సమయంలో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా పేరు మార్పుపై కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. నిజానికి ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరులో. ఆయన తొలి రాజకీయ అడుగులు, గుడివాడలో చేసిన ఎన్నికల పోరాటం ఇవి ప్రస్తుత కృష్ణా జిల్లా పరిధిలోనే ఉన్నాయి. కానీ, జిల్లాల పునర్విభజన సమయంలో ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు ఇవ్వడం టీడీపీ నాయకులకు అప్పట్లోనే అసంతృప్తిని కలిగించింది.


ఎన్టీఆర్ పేరుకు గౌరవమే కానీ, ఆయన జన్మస్థానం లేదా రాజకీయ పునాది ప్రాంతానికి సంబంధం లేకుండా పేరు పెట్టడం సరికాదని వారు విమర్శించారు. ఈ నేపథ్యంతోనే ఎన్టీఆర్ జిల్లా పేరు మార్చి “కృష్ణా”గా పెట్టాలనే సూచనలు ప్రభుత్వం ముందుకు వస్తున్నాయి. కృష్ణా నది విజయవాడ గుండెల్లో ప్రవహించడం, నగరంతో అనుబంధం బలంగా ఉండటం ఈ ప్రతిపాదనకు ప్రధాన కారణాలు. అలాగే, ఎన్టీఆర్ జన్మస్థానం, ఆయన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ప్రాంతాలను అంటే ప్రస్తుత కృష్ణా జిల్లాకు “ఎన్టీఆర్ జిల్లా”గా నామకరణం చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడలో ఉన్న వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు ఉండటం వల్ల కొత్త జిల్లాకు కూడా అదే పేరు ఉండటం అవసరం లేదని నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ పేరును ఆయన వారసత్వానికి అనుగుణంగా సరైన ప్రాంతానికి కేటాయిస్తేనే నిజమైన గౌరవం ద‌క్కుతుంద‌న్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: