రాములమ్మగా ప్రచారంలో ఉన్న సినీనటి విజయశాంతి మళ్ళీ బీజేపీలోకి రీఎంట్రీ ఇవ్వటం దాదాపు ఖాయమైపోయింది. టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్ధానం ప్రారంభించిన రాములమ్మ తర్వాత బీజేపీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. తాజాగా మళ్ళీ యూ టర్న్ తీసుకుని కమలం కండువా కప్పుకోవటం ఖాయమైపోయింది. ఢిల్లీకి వెళ్ళి అగ్రనేతలతో భేటీ జరపబోతున్నారు. పార్టీలో తన స్ధానమేంటి ? తనకు కావాల్సిన పదవులేంటి అనే విషయంలో బహుశా బేరాల కోసమే భేటీ జరగుతుందని అనుకుంటున్నారు. రాములమ్మ పార్టీ మారిపోతోందనే ప్రచారం ఈనాటిది కాదు. ఎప్పటి నుండో మీడియాలో ప్రచారం అవుతోంది. కాంగ్రెస్ లో నుండి కమలంపార్టీలోకి జంప్ చేస్తారని కూడా చాలా సార్లు వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ కు రాజీనామా చేయటం, అగ్రనేతలతో భేటికి ఢిల్లీకి సోమవారం వెళ్ళటం ఎవరికీ ఆశ్చర్యం అనిపించలేదు. మొన్ననే ముగిసిన దుబ్బాక ఉపఎన్నికలో గానీ ఇపుడు జరుగుతున్న గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో గానీ ఆమె కాంగ్రెస్ తరపున ప్రచారం చేయలేదు. పైగా ప్రచార కమిటికి విజయశాంతి ఛైర్మన్  అయ్యుండి కూడా ప్రచారం చేయటం లేదంటేనే అర్ధమైపోతోంది ఆమె మూడ్ ఏమిటన్నది.





సరే ఇపుడు ఆమె కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలో చేరిన కారణంగా హస్తం పార్టీకి జరగబోయే నష్టం ఏమిటి ? అనేది చూద్దాం. నిజానికి ఆమె ఏ పార్టీలో ఉన్నా ఒకటే. ఆమెను  చూసి పార్టీలకు ఓట్లేసే జనాలు ఎంతమంది ఉంటారన్నది అనుమానమే. పార్టీ ఓట్లే ఆమె ఓట్లు కాబట్టి ఆమెను చూసో లేకపోతే ఆమె ప్రచారం చేస్తే వచ్చే ఓట్లంటు  ప్రత్యేకంగా ఏమీ ఉండవనే అనుకోవాలి. ఎందుకంటే మొదట్లీ టీఆర్ఎస్ లో ఉన్నపుడు కానీ లేకపోతే బీజేపీలో ఉన్నపుడు అదీకాకపోతే కాంగ్రెస్ లో ఉన్నపుడు కానీండి విజయశాంతి వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఏమీ లేదనే చెప్పాలి. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడటం, అర్ధంపర్ధం లేని ఆరోపణలు, విమర్శలు చేయటం మళ్ళీ కొంతకాలం పాటు అడ్రస్ లేకుండా హైడ్ అవుట్ లోకి వెళ్ళిపోవటం రాములమ్మకు మామూలే. టీఆర్ఎస్ లో ఉన్నపుడు ఎంపిగా గెలిచిన రాములమ్మ మళ్ళీ ఎక్కడా గెలిచిందే లేదు. అచ్చంగా సినీ గ్లామర్ వల్లే ఓట్లొచ్చే రోజులు ఎప్పుడో  పోయాయని బహుశా రాములమ్మ మరచిపోయారేమో.




పార్టీలో కష్టపడి పనిచేయటం, క్యాడర్ తో మంచి సంబంధాలు పెట్టుకోవటం, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్దితో పనిచేయటం లాంటి వాటివల్లే జనాల్లో మంచిపట్టు సాధిస్తారు ఎవరైనా. జనాలతో మంచి సంబంధాలున్న నేతలనే జనాలు కూడా గుర్తు పెట్టుకుంటారన్న సూక్ష్మాన్ని విజయశాంతి మరచిపోయారు. ఏ పార్టీలో ఉన్న జనాలతో మమేకం అవ్వటం వల్లే నియోజకవర్గంలో పట్టు పెరుగుతుంది. అలాంటి అలవాట్లు రాములమ్మలో ఉన్నట్లు లేదు. ఎందుకంటే అధికారపార్టీలో నుండి వచ్చేసిన తర్వాత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాములమ్మ చేసిన ఆందోళనలు పెద్దగా ఏమీ లేవనే చెప్పాలి. నిజానికి ఈమె గనుక ఆందోళనల పేరుతో రోడ్లెక్కితే జనాలు రావటం, మీడియా అటెన్షన్ ఉంటుందనటంలో సందేహం లేదు. ఆ అడ్వాంటేజిని కూడా విజయశాంతి పెద్దగా ఉపయోగించుకోలేదు. కాబట్టి రాములమ్మ ఏ పార్టీలో ఉన్నా వచ్చే ఉపయోగం లేదనే చెప్పాలి. ఏదో నాలుగు మాటలతో మీడియాలో హైలైట్ అవ్వటం తప్పించి ఇతరత్రా ఉపయోగాలు ఏవీ ఆమె పనిచేసిన పార్టీల్లో కనబడలేదు. మరి కమలంపార్టీలో  రాములమ్మ సెకండ్ ఇన్నింగ్స్ ఎలాగుంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: