‛ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావనే లేదు.’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ అనే సందిగ్ధతపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇచ్చిన సమాధానం అది. అయితే మంత్రి సమాధానంపై సోషల్ మీడియాలో పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలులో ఉంటే.. అది కూడా రాజధాని అవుతుందా? అంటూ చాలా మంది యూజర్లు ప్రశ్నించారు. మరొకరేమో సీఎం జగన్ ఇప్పుడు సిమ్లాలో ఉన్నాడని, అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని సిమ్లా అవుతుందా? అంటూ ప్రశ్నించారు. ఏపీ క్యాపిటల్ కోసం జీపీఎస్ ట్రాకర్ వాడాలేమో అంటూ మరొక యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఎక్కడంటే అక్కడ కూర్చొని పనిచేయడానికి అది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదని, నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేయాలని మరొక యూజర్ అన్నాడు. అప్పటిదాకా విభజన చట్టం ప్రకారం హైదరాబాదే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని కామెంట్ చేశాడు.

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మూడు రాజధానులకు కట్టుబడి ఉంటామన్నారు. ఆర్థిక, శాసన, న్యాయ రాజధానుల్లో మార్పు లేదని స్పష్టం చేశారు. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా విజయవాడ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని చెప్పారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారమే రాజధానులు ఉంటాయని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమైతే రాజధాని అనే సబ్జెక్టే లేదన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని, అదే సెక్రటేరియట్ అవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ పనిచేస్తారో అక్కడే అడ్మనిస్ట్రేటివ్, రాజధాని ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని చెప్పి, తరువాత నమూనాగా మాత్రమే చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో మంత్రి మాటలకు వ్యంగ్యమైన కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: