ఇంగ్లిష్ వారికి ఎలాగయితే కొత్త సంవత్సరం జనవరి 1 వ తేదీన మొదలవుతుందో...అదే విధంగా తెలుగు వారు అయిన మనకు తెలుగు సంవత్సరాది ఉగాది రోజు నుండే మొదలవుతుంది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. ముందుగానే తెలుగు వారికి సెంటిమెంటు ఎక్కువ.  దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన హిందూ పండుగలలో ఉగాది కూడా ఒక్కటి.  శార్వరి నామ సంవత్సరం సెలవు తీసుకుని తాజాగా ఈరోజున (13 ఏప్రిల్‌) శ్రీ ప్లవనామ సంవత్సరం ప్రవేశిస్తోంది. అయితే ఈ రోజున ఉదయం లేవడం దగ్గర నుండి రాత్రి పడుకోయే ముందు వరకు సంతోషంగా గడుపుతారు. పండుగ అంటే ముఖ్యంగా కుటుంబంతో ఆనందంగా గడపడం మాత్రమే. అందరూ సంతోషంగా ఉన్న రోజే పండుగ అవుతుంది. 

ఈ రోజున ఈ తెలుగు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని, ఒకవేళ బాగా లేకుంటే అలాంటి వారికి గ్రహశాంతులు జరుపుకుని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణం చేస్తారు.  ఉగాది అనేది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాము.  ఈ ఉగాది రోజు తరువాతనే ముందు ముందు మరిన్ని పండుగలు వస్తాయి. ఈ రోజున ముఖ్యంగా మహిళలు ఇల్లు, వాకిలి, శుభ్రపరుచు కోవటం ఇంటి పనులతో ఎంతో సందడిగా ఉంటారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. ఉదయాన్నే అభ్యంగ స్నానమాచరించి నూతన వస్త్రాలు ధరించి, ధ్వజారోహణ చేయాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినాలి. వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు. దీని సేవనం వల్ల వాత, కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతుంది.

ఈ రోజున ఎవరైనా కొత్త పనులను ప్రారంభించడానికి మక్కువ చూపిస్తారు. ఇలా చేయడం వలన మంచి జరుగుతుందని వారి నమ్మకం. అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఒక దేవుడు ఉంటారు. కానీ ఉగాది పండుగకు దేవుడెవరో తెలుసా ? కలిపురుషుడు అధిదేవత. అందుకనే ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: