పరిపూర్ణమైన మానవ రూపం ఎత్తిన శ్రీరాముడు  తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే తాను సమస్యలన్నిటిని ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ధర్మంగా ఎలా ముందుకు నడవాలో అద్భుతంగా తెలియజేశారు. ఏక పత్ని వ్రతం, ధర్మ సంరక్షకుడిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీ రాముడి జీవిత చరిత్రే రామాయణం.

అయితే ఈ రోజు శ్రీరామ నవమి కాబట్టి ఇంట్లోనే ఎలా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాములవారు వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్‌ ముహూర్తం అనగా మధ్యాహ్నం 12:00 గంటలకు త్రేతాయుగంలో పుట్టారు. అందువల్ల శ్రీరాముడు పుట్టిన ఘడియలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తే శ్రీరాముడి మోక్షం లభించి.. భక్తుల కోరికలు నెరవేరుతాయి.

శ్రీరామనవమి నాడు పూజ చేసే ముందు ఆచరించాల్సిన ఆచరణలు తెలుసుకుంటే.. సకుటుంబ సపరివార సమేతంగా పొద్దున్నే నిద్రలేచి తల స్నానం చేయాలి. అనంతరం ఉతికిన వస్త్రాలను లేక నూతన దుస్తులను ధరించాలి. సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ దేవదేవుళ్ళు కలిసి ఉన్న ఓ శ్రీరాముడి చిత్రపటాన్ని లేదా సీతారామచంద్రుల విగ్రహాలను పూజా మందిరంలో ఉంచాలి. అనంతరం శ్రీరామ అష్టోత్తర పూజ నిర్వహించాలి.

బెల్లం, మిరియాలు, యాలకులు మంచినీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని.. పానకం తయారు చేసి.. నానబెట్టిన పెసరపప్పు(వడపప్పు) తో కలిపి పానకం నైవేద్యం గా పెట్టాలి. అనంతరం వడపప్పు, పానకం ప్రసాదంగా తీసుకోవాలి. ఎవరైతే భక్తులు శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం జరిపిస్తారో లేక వీక్షిస్తారో వారికి సర్వ శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

నానబెట్టిన పెసరపప్పు, పానకం ప్రత్యేకంగా ప్రసాదంగా స్వీకరించడం వెనుక సైంటిఫిక్ గా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలు, యాలకులు స్వీకరించడం వల్ల వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత రుగ్మతలు తగ్గుతాయి. మిరియాలు, యాలకుల మిశ్రమంతో తయారు చేసే పానకం ఓ అద్భుతమైన ఔషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఇక పెసరపప్పు కూడా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎండాకాలంలో నానబెట్టిన పెసరపప్పు తినడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది. దీనివల్ల చలవ చేయడంతోపాటు జీర్ణశక్తిని పెంచుతుంది. శ్రీ రాముడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం తినడం వల్ల శరీరానికి ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: