వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ఉండ్రాళ్లు, మోదకాలు, బంతిపూలతో చేసిన అలంకరణలు, 21 రకాల పత్రి ఆకులు. కానీ గణపతికి దోసకాయను నైవేద్యంగా పెట్టే ఆచారం గురించి చాలా మందికి తెలియదు. ఇది అరుదైన సంప్రదాయం మాత్రమే కాకుండా, ఒక ప్రత్యేకమైన పురాణ కథ, ఆరోగ్య రహస్యాలను కూడా కలిగి ఉంది. పురాణాల ప్రకారం, గణపతి తల్లి పార్వతి దేవి గర్భం నుంచి కాకుండా పసుపు ముద్దతో పుట్టాడు. సాధారణంగా శిశువు పుట్టినప్పుడు బొడ్డుతాడు కోసే ఆచారం ఉంటుంది. కానీ వినాయకుడికి అలాంటి బొడ్డుతాడు లేకపోవడంతో, ఆయనకు సంపూర్ణ జన్మ ఇచ్చినట్లుగా భావించడానికి బొడ్డుతాడుకు ప్రతీకగా దోసకాయను నైవేద్యంగా పెడతారు.
 

పూజలో దోసకాయను నరికి సమర్పించడం ద్వారా, గణపతి భూమి మీద పుట్టినవాడిగా, సంపూర్ణంగా అవతరించిన వాడిగా భావిస్తారు. ఆ తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరించడం సంప్రదాయంగా మారింది. కానీ ఈ ఆచారం వెనుక కేవలం పురాణ విశ్వాసమే కాదు, ఆరోగ్య పరమైన లోతైన జ్ఞానం కూడా ఉంది. ఆయుర్వేదం ప్రకారం, వినాయక చవితి కాలం వాతావరణ మార్పుల సమయం. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో శరీరానికి చలువ, తేలికైన ఆహారం అవసరం అవుతుంది. దోసకాయలో 95 శాతం వరకు నీరు ఉండటం వలన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. డీహైడ్రేషన్‌ను నివారించి శరీరానికి చలువ ఇస్తుంది. అదేవిధంగా, దోసకాయలో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

 

పండుగ రోజున ఎక్కువ ఆహారం తీసుకున్నా జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచిది. విటమిన్ C, నీరు అధికంగా ఉండటం వలన చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో దోసకాయ కీలక పాత్ర పోషిస్తుంది. మన పూర్వీకులు ఆహారాన్ని ఔషధంగా వాడాలనే దూరదృష్టితోనే వినాయకుడికి దోసకాయను నైవేద్యంగా పెట్టే సంప్రదాయాన్ని ఆచరించారు. ఇది ఒక సాధారణ ఆచారంలా కనిపించినా, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు చూసినప్పుడు వారి జ్ఞానానికి నమస్కరించక మానలేం. వినాయక చవితి రోజు దోసకాయ నైవేద్యం పెట్టడం కేవలం ఒక భక్తి కార్యక్రమం కాకుండా, మన ఆరోగ్యానికి పండుగ కానుక అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: