ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య రోజుకో వివాదం పుట్టుకొస్తుంది. నకిలీ ఓట్లు, ఓట్ల గల్లంతుపై ఇప్పటికే రెండు పార్టీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఇరు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ పంచాయతీ కాస్తా కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్లింది.


ఏపీలో ఉన్న వాలంటీర్లను అడ్డుపెట్టుకొని ప్రజల వివరాలను సేకరించి  ఆ డేటాను అంతా హైదరాబాద్ లోని ఓ సంస్థకు చేరవేస్తున్నారని.. అక్కడి నుంచి ఐప్యాక్ టీం కు వెళ్తోందని టీడీపీ వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.  టీడీపీ ఆరోపణలకు కౌంటర్ గా తెలుగుదేశం-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ ఆరు హామీలను  ప్రకటించింది. చంద్రబాబు అరెస్టు కావడానికి ముందు వరకు ఈ మినీ మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలను టీడీపీ చేపట్టింది.


ఇప్పుడు జనసేన టీడీపీ ఉమ్మడి మ్యానిఫెస్టో 11అంశాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే చేసే పనులను అందులో వివరించారు. ఇలా ఇంటింటికీ వెళ్లినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారి డేటా సేకరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. డేటా తీసుకోని ఒక యాప్ లో నమోదు చేస్తే ఓటీపీ వస్తోందని అంటున్నారు. ఇలా ఓటీపీ ద్వారా వచ్చే లింక్ ను ఓపెన్ చేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు వస్తోంది. ఈ కార్డులో ఆ కుటుంబానికి అభినందనలు తెలిపి 2024 జూన్ నుంచి ఎంత మొత్తం నగదు జమ చేస్తారో చెబుతున్నట్లు చంద్రబాబు సంతకం చేసినట్లు ఇస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.


ఇలా ప్రజల దగ్గర డేటా తీసుకోవడం సైబర్ క్రైం కిందకే వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటిస్తున్నారు. ప్రజల ఓటర్ కార్డు తీసుకొని ఇలా ఇవ్వడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని వారు పేర్కొంటున్నారు. చూద్దాం దీనిపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: