అదేదో సామెతలో చెప్పినట్లు మంచి చేయబోయినా ఎంఎల్ఏ రోజా పై నెగిటివ్ ప్రచారమే జరుగుతోంది. తాజాగా నగిరి ఎంఎల్ఏ ఆర్కె రోజా పై జనాలు పూలవర్షం కురిపించారు. దాన్ని సహించలేని టిడిపి నేతలు తమ నోళ్ళకు పనిచెప్పారు. దాంతో ఒళ్ళు మండిపోయిన కొందరు టిడిపి లోకల్ లీడర్లకు వార్నింగులిచ్చారు. అంతేనా, ఇంకోసారి రోజాపై నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగుండదంటూ చీపుర్లు, చేటలు కూడా చూపించి వార్నింగులివ్వటం నియోజకవర్గంలో సంచలనంగా మారింది.

 

ఇంతకీ అసలు జరిగిందేమిటంటే పుత్తూరు మున్సిపాలిటి పరిధిలో సుందరయ్య నగర్ అని ఒకటుంది. అందులోని వాళ్ళకు నీటి సౌకర్యం లేదు. గడచిన పదేళ్ళుగా వాళ్ళు ఎంతగా మొత్తుకుంటున్నా సౌకర్యాలు కల్పిస్తామని టిడిపి నేతలు చెప్పటమే కానీ ఎవరూ మాట మీద నిలబడలేదు. దాంతో మొన్నటి ఎన్నికల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తేనే ఓట్లేస్తామంటూ గట్టిగా తీర్మానించారు. ఓట్లకోసం వచ్చిన వాళ్ళకు ఇదే విషయాన్ని చెప్పారు.

 

గెలిచిన తర్వాత మంచినీటి సౌకర్యం కల్పిస్తానని రోజా హామీ ఇచ్చారు. దాంతో రోజాను నమ్మి వాళ్ళు ఓట్లు కూడా వేశారు. చెప్పిన మాట ప్రకారం రోజా సుందరయ్యనగర్లో బోరు వేయించి కొళాయిలు కూడా పెట్టించారు.  దాంతో హ్యాపీగా ఫీలైన స్ధానికులు మంచినీటి పంపును ప్రారంభించేందుకు వచ్చిన రోజాకు పూలవర్షం కురిపించారు. రాజా వచ్చే దారిలో పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదే విషయం వాట్సప్ ద్వారా వైరల్ అయ్యింది. వాట్సప్ వీడియోలను చూసిన కొందరు టిడిపి నేతలు రోజాను తప్పు పడుతు పోస్టింగులు పెట్టారు.

 

కరోనా వైరస్ సంక్షోభం సమయంలో  పూలు చల్లించుకోవటం ఏమిటంటూ తప్పు పట్టారు. దాంతో విషయం తెలిసిన స్ధానికులకు ఒళ్ళు మండిపోయింది. సంవత్సరాలుగా  ఉన్న మంచినీటి సమస్యను తీర్చిన రోజాపై అభిమానంతో తాము  పూలు చల్లితే దాన్ని కూడా తప్పు పట్టటమేంటంటూ తిట్టిపోశారు. తమ కష్టాన్ని తీర్చిన రోజాపై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదంటు వార్నింగులు కూడా ఇచ్చారు. మొత్తానికి ఈ విషయం ఇపుడు నియోజకవర్గంలో వైరల్ గా మారింది.

 

ఇదే విషయాన్ని రోజా మాట్లాడుతూ తనకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు ఏవో ఆరోపణలు చేస్తునే ఉంటారన్నారు. జనాలకు మంచి చేయాలని చూసినా వివాదం చేసే వాళ్ళని చూస్తే ఏమి మాట్లాడాలో కూడా అర్ధం కావటం లేదన్నారు. 24 గంటలూ బురద రాజకీయాలను చూసే వాళ్ళని చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. ఎంఎల్ఏగా మంత్రిగా, ఎంఎల్సీగా పనిచేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఆయన కుటుంబం పుత్తూరు నియోజకవర్గాన్ని గాలికొదిలేసిందంటూ మండిపడ్డారు. పుత్తూరు మున్సిపాలిటిలోని సుందరయ్యనగర్ జనాలకు నీటి సౌకర్యం కల్పించినా కూడా గాలి కుటుంబం, టిడిపి నేతలు తట్టుకోలేకపోతున్నట్లు రోజా చెప్పింది నిజం లాగే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: